
అవగాహన కార్యక్రమంలో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి ప్రజా ప్రభుత్వాలు సహకారమందించాలని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ కోరారు. వివిధ కోర్టుల్లో ఖాళీల పూరింపునకు కొలీజయం చేసిన సిఫార్సులను సత్వరమే ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సిఫార్సుల సత్వర అమలుతో పెండింగ్ కేసుల సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. ఇప్పటికే పలు సిఫార్సులను ఆమోదించామని, త్వరలో మిగిలినవాటికి అనుమతినిస్తామన్న కేంద్ర న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కోవిడ్‌తో న్యాయవ్యవస్థలో నెలకొన్న లోతైన సమస్యలు బయటపడ్డాయన్నారు. బలహీనవర్గాలకు సత్వర సమన్యాయం అందాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్‌నెస్, అవుట్‌రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్‌నా«థ్ కోవింద్ శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని గాంధీ భావించేవారని రమణ గుర్తు చేశారు. సమ్మిళిత వృద్ధి మాత్రమే స్థిరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందనేది కాదనలేని సత్యమని తెలిపారు.
సమన్యాయం తక్షణ అవసరం
సమన్యాయం అందించకుండా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించడం అసాధ్యమన్నారు. దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం అందించేందుకు కార్యనిర్వాహక, చట్టసభలు, న్యాయవ్యవస్థలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య నాణ్యత నాణ్యమైన న్యాయంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజాస్వామ్య దేశంలో సంస్థల్ని నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని పునరుద్ఘాటించారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన నల్సా కోట్లాదిమందికి సేవలందించిందన్నారు. గాందీజీ జయంతినాడు మొదలైన ఈ కార్యక్రమం నెహ్రూ జయంతి రోజున ముగుస్తుందన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరుకోవడానికి యతి్నస్తున్నామని, దీనికి అందరి సహకారం కావాలన్నారు. న్యాయవాది అయిన రాష్ట్రపతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమణ చెప్పారు. చట్టపరమైన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రపతి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళాభివృద్ధికి పాటుపడాలి
సీనియర్ న్యాయవాదులు మహాత్మా గాంధీ ఆదర్శాలను పాటించి, పేదలకు సేవలందించాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. మహిళాభివృద్ధికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది భావన నుంచి మహిళల వల్ల అభివృద్ధి అనే భావనకు మరలాలన్నారు. సహేతుకమైన మూల్యానికి ఉత్తమ న్యాయ ప్రతిభ అందుబాటులో ఉండాలని గాంధీ కోరుకునేవారన్నారు. లాయర్లు తమ సమయంలో కొంత బలహీనవర్గాల సేవలకు కేటాయించాలన్నారు. కోర్టు బయట పరిష్కారాలను గాం«దీజీ బలంగా విశ్వసించేవారన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్ర మరింత పెరగాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ న్యాయ సేవలు అందించడానికి నల్సా చేస్తున్న సేవలనుకోవింద్ ప్రశంసించారు.