40.54 లక్షల పెండింగ్ కేసులు
24 హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తులకు గాను 608 మందే...
• న్యాయమూర్తుల కొరత 44 శాతం
• పెండింగ్ కేసుల్లో సివిల్ 29,31,352, క్రిమినల్ 11,23,178
• హైకోర్టులో జడ్జీల ఖాళీలు, అపరిష్కృత కేసులపై సుప్రీం నివేదిక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు, న్యాయమూర్తుల ఖాళీలపై సుప్రీంకోర్టు వార్షిక నివేదికలో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. సుప్రీంకోర్టు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం 24 హైకోర్టుల్లో 40.54 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, 44 శాతం న్యాయమూర్తుల కొరతతో కోర్టులు తంటాలు పడుతున్నాయి. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మధ్య సంఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ‘భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2015–16’ పేరిట గతేడాది జూన్30 వరకూ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల ఖాళీలు, పెండింగ్ కేసుల వివరాల్ని సుప్రీంకోర్టు ఇందులో పొందుపరిచింది.
సుప్రీం నివేదిక ప్రకారం... మొత్తం 24 హైకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 1,079 కాగా, కేవలం 608 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య కంటే ఇది 43.65 శాతం తక్కువ. ఇక 40.54 లక్షల అపరిష్కృత కేసుల్లో సివిల్ కేసుల సంఖ్య 29,31,352 కాగా, క్రిమినల్ కేసులు 11,23,178. మొత్తం కేసుల్లో పదేళ్లకు పూర్వం నుంచి అపరిష్కృతంగా ఉన్న కేసులు 7,43,191.
హైదరాబాద్‌లో 2.78 లక్షల కేసులు: అలహాబాద్ తర్వాతి స్థానం మద్రాసు హైకోర్టుది... అక్కడ అపరిష్కృత కేసులు 3,02,846 కాగా... 75 మంది న్యాయమూర్తులకుగాను 38 మందే ఉన్నారు. బాంబే హైకోర్టులో 2,98,263 కేసులు అపరిష్కృతంగా ఉండగా, అందులో 53,511 కేసులు పదేళ్లకు పూర్వం నాటివి.ఈ కోర్టుకు 94 మంది న్యాయమూర్తుల్ని కేటాయించగా 64 మందితోనే పనిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టులో గతేడాది జూన్ 30 నాటికి 40 శాతం మేర న్యాయమూర్తుల కొరత ఉండగా... 60 మందికి గాను కేవలం 35 మంది న్యాయమూర్తులతోనే విధులు నిర్వర్తిస్తోంది.
ఏపీ, తెలంగాణల ఉమ్మడి హైకోర్టులో 2,78, 695 కేసులు అపరిష్కృతంగా ఉండగా ఇందులో 24,606 కేసులుS పదేళ్లనాటివి. న్యాయమూర్తుల విషయానికొస్తే 61 మంది అవసరం కాగా కేవలం 25 మందితో నడుస్తోంది. పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టుల్లో కూడా 2.5 లక్షలకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. గుజరాత్‌లో 52 మంది న్యాయమూర్తులకు 33 మందే ఉండగా... అపరిష్కృత కేసుల సంఖ్య 92,393గా ఉంది.
చత్తీస్‌గఢ్ హైకోర్టులో 8 మంది న్యాయమూర్తులే
దేశంలో చత్తీస్‌గఢ్ హైకోర్టులో అత్యంత తక్కువగా 37 శాతం మాత్రమే న్యాయమూర్తులున్నారు. ఈ హైకోర్టుకు 22 మంది అవసరం కాగా ప్రస్తుతం 8 మందే పనిచేస్తున్నారు. ఇక పెండింగ్ కేసులు మాత్రం 54 వేలకు పైనే ఉన్నాయి.
అలహాబాద్ టాప్
అపరిష్కృత కేసులు, న్యాయమూర్తుల ఖాళీల్లో అలహాబాద్ హైకోర్టు ముందంజలో ఉంది. కేటాయించిన న్యాయమూర్తుల్లో సగం కంటే తక్కువ మందితో పనిచేయడంతో పాటు, దేశం మొత్తం పెండింగ్ కేసుల్లో నాలుగో వంతు ఈ హైకోర్టులోనే ఉండడం విశేషం. మొత్తం 9.24 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా... 3 లక్షలకు పైగా కేసులు 10 ఏళ్లకు ముందటివి. అలహాబాద్ హైకోర్టులో మొత్తం 160 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 78 మందే ఉన్నారు.