సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే చర్యలు
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే చర్యలు
Published Sun, Mar 5 2017 10:40 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
జిల్లా ఎస్పీ రవిప్రకాష్
పిఠాపురం రూరల్ : పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్‌ను ఆదివారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలన్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సివిల్ దందాలో పోలీసుల పాత్ర ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత నెల 27న చిత్తూరులో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో మావోయిస్టు దళ కమిటీ సభ్యులు హరిభూషణ్‌తో పాటు ఐతు చనిపోయినట్టు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమకు లభించాయని చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కన్నయ్య, మోహన్‌లకు కాకినాడలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అక్రమ పశు వధ, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మాహత్యాయత్నం సంఘటనలో ఆ స్టేషన్ ఎస్‌ఐ చైతన్యకుమార్‌పై సర్పవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని పిఠాపురం రూరల్ ఎస్‌ఐ వి.సుభాకర్‌కు మెమో జారీ చేస్తున్నట్టు తెలిపారు.
Advertisement