తెలంగాణలో 3.44 లక్షల పెండింగ్ కేసులు
- క్రిమినల్ కేసులదే అగ్రస్థానం
- అత్యధిక కేసుల్లో హైదరాబాద్ తొలిస్థానం
- రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులు అధికం
- చివరిస్థానంలో నల్లగొండ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసుల లెక్కలు తేలాయి. తెలంగాణలో ఉన్న మొత్తం 10 జిల్లాల్లోని అన్ని రకాల న్యాయస్థానాల్లో ఈ నెల 2 వరకు అక్షరాలా 3,44,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో క్రిమినల్ కేసులదే మొదటిస్థానం. క్రిమినల్ కేసులు 1,85,127 పెండింగ్‌లో ఉంటే, 1,59,583 సివిల్ కేసులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 85,132 కేసులు పెం డింగ్‌లో ఉన్నాయి. ఇందులో క్రిమినల్ కేసులే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఈ జిల్లాలో 46,009 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నా యి. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 11,755 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లోనూ ఈ జిల్లాదే చివరి స్థానం.
క్రిమినల్ కేసుల పెండింగ్‌లో హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా జరిగే రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జిల్లాలో 39,652 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక అన్ని జిల్లాల్లో కలిపి మహిళలు దాఖలు చేసిన 40,152 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సివిల్ కేసులే అత్యధికం. మహిళలు దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 10 జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఖాళీలతో సహా మొత్తం 291 న్యాయాధికారులున్నారు.