కర్నూలు(లీగల్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,666 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత, కార్యదర్శి ఎం.వి.సోమశేఖర్‌లు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ అదాలత్‌లో జిల్లా 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.వి.శేషు బాబు 33 రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.78.65లక్షల పరిహారం చెల్లించేలా తీర్చునిచ్చారు. రాజీ కాగల క్రిమినల్ కేసులు, ప్రీలిటిగేషన్, సివిల్ కేసులను లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ పరిష్కరించారు.
కర్నూలులో 669 కేసులు, నంద్యాలలో 508, ఆదోనిలో 153, పత్తికొండలో 37, ఆలూరులో 46, ఎమ్మిగనూరు 39, డోన్‌లో 33, బనగానపల్లెలో 12, కోయిలకుంట్లలో 35, ఆళ్లగడ్డలో 63, ఆత్మకూరులో 37, నందికొట్కూరులో 34 కేసులను పరిష్కరించారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా ద్వితీయ స్థానంలో నిలువగా.. మొదటి స్థానాన్ని గుంటూరు జిల్లా దక్కించుకుంది. సాయంత్రం 3.30 గంటలకు లోక్ అదాలత్ కార్యాలయంలో విద్యార్థులకు ‘భారత రాజ్యాంగం-మానవ హక్కుల రక్షణ’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, మహిళా సాధికారతపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు.
న్యాయాధికారులు సోమశేఖర్, గాయత్రిదేవి, స్వప్నారాణి, పి.రాజు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి, భాష్యం, సెయింట్‌జోసెఫ్, సీరాక్, శ్రీలక్ష్మీ, వాసవి మహిళా కళాశాల, ఎస్సీ, ఎస్టీబీసీ కళాశాల, ప్రసూన లా కాలేజీ, ఉస్మానియా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 1,666 కేసుల పరిష్కారం
Published Sun, Mar 13 2016 3:30 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement