లోక్ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం
జిల్లా జడ్జి ఉదయగౌరి
154 కేసుల్లో రాజీ
ఆదిలాబాద్ క్రైం : లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని జిల్లా జడ్జి ఉదయగౌరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఇరువురు కక్షిదారుల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ కుదిర్చి సమస్యలను పరిష్కరించారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 154 కేసుల్లో రాజీ కుదిరింది. అందులో 129 క్రిమినల్ కేసులు, 23 సివిల్ కేసులు, మూడు ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, కక్షిదారులు కోర్టుల చుట్టూ నెలల తరబడి తిరగకుండా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో కక్షిదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి అరుణసారిక, మేజిస్ట్రేట్లు మేరిసార దానమ్మ, భారతి, రాజ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ జ్ఞానేశ్వర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.