ప్రీ–లోక్ అదాలత్ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు అనుగుణంగా ప్రీ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ఫస్ట్ క్లాస్ అడిషనల్ జిల్లా జడ్జితో పాటు ఇన్‌చార్జి జిల్లా జడ్జి, జాతీయ లోక్ అదాలత్ అధ్యక్షుడు బి. గౌతం ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మోటారు వాహన ప్రమాదాల కేసులు పరిష్కరించడంలో భాగంగా బీమా కంపెనీలతో మాట్లాడి కక్షిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు.
క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీ చేయదగ్గ కేసుల వివరాల జాబితాను పోలీసు అధికారులు తయారుచేయాలన్నారు. వీటిని కూడా లోక్ అదాలత్‌లో ఇరువర్గాల ఆమోదంతో సత్వరమే పరిష్కరిస్తామని వివరించారు. పారాలీగల్ వలంటీర్లు అందుబాటులో ఉండి లోక్ అదాలత్ కార్యక్రమంలో తమ సేవలను అందించి విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఫోర్త్ క్లాస్ అడిషినల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి వి.గోపాలకృష్ణారావు, స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు వై. శ్రీనివాసరావు, గేదెల ఇందిరాప్రసాద్, పోలీసు, అధికారులు, పారా లీగల్ వలంటీర్లు, కక్షిదారులు తదితరులు హాజరయ్యారు.