♦ నమోదవుతున్న కేసులకు, శిక్షలకు భారీ వ్యత్యాసం
♦ నత్తనడకగా దర్యాప్తు, పెండింగ్‌లో లక్ష కేసులు
♦ కేసుల్లో పెరుగుతున్న రాజకీయ జోక్యం
♦ నేతల ప్రసన్నానికే పోలీసుల ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసుల దర్యాప్తు వేగం మందగించింది. పెండింగ్ కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది. నమోదవుతున్న నేరాలకు, శిక్ష అనుభవించే వారికి భారీగా వ్యత్యాసం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కేవలం 36 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయి. జాతీయ సగటు 46 శాతంతో పోల్చితే పదిశాతం వెనకబడి ఉంది. దీంతో నేరగాళ్లు తప్పులు చేసి కూడా.. దర్జాగా బయటే తిరుగుతున్నారు. కేసుల నమోదు, దర్యాప్తు విధానంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగింది. చిన్న చిన్న కేసుల్లో సైతం నేతలు తలదూర్చడంతో పోలీసులు చేతులెత్తేస్తున్నారు. విధినిర్వహణలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఇటీవల ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి వీకే.సింగ్ చేసిన బహిరంగ ప్రకటన.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
పెండింగ్‌లో లక్ష కేసులు..
నేరగాళ్లకు శిక్ష విధించడంలో ప్రధానంగా కేసు దర్యాప్తు పూర్తిచేసి అభియోగాల్ని దాఖలు చేయడంతోపాటు న్యాయ విచారణలో సైతం పోలీసులు తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. దర్యాప్తు విధానంలో సరైన విధానాలు పాటించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే చాలా కేసుల్లో గడువు దాటినా దర్యాప్తు పూర్తికావడం లేదు. నిబంధనల ప్రకారం నిందితుడి అరెస్టు తర్వాత 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. లేనిపక్షంలో నిందితులకు బెయిల్ పొందే అర్హత లభిస్తుంది. దర్యాప్తు సకాలంలో పూర్తికాక అనేకమంది నిందితులు బెయిల్‌పై బయటకు వస్తున్నారు.
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు..!
పోలీసులపై రాజకీయ నేతల ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు కేసుల నమోదు మొదలుకొని, దర్యాప్తు విధానాన్ని సైతం నాయకులు ప్రభావితం చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో వీరి జోక్యం కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోతోంది. ఒకవేళ నేతలను కాదని దర్యాప్తులో ముందుకెళ్తే.. అధికారులపై బదిలీ వేటు పడుతోంది. ప్రొటోకాల్ పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అధిక సమయం వారికే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో పోలీసులు కేసుల దర్యాప్తును పక్కన పెట్టేశారు. ఫలితంగా రాష్ట్రంలో నేరగాళ్లకు కట్టడి లేక.. వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంతిమంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారు.
సా...గుతున్న పోలీసుల దర్యాప్తు!
Published Mon, Apr 25 2016 3:07 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
Advertisement
Advertisement