నల్లగొండ లీగల్ : జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి డా.షమీమ్ అక్తర్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన సందర్భంగా శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతరం వివిధ కోర్టు తీర్పులను అధ్యయనం చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. తాను నల్లగొండలో న్యాయవ్యాదిగా పనిచేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎం.ఆర్. సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏకాగ్రతతో చదువుకోవాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్ అన్నారు. పట్టణంలోని డ్వాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంధుల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలన్నారు. తాను కూడా ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అంధులమని బాధపడకుండా కష్టపడి చదవాలని సూచించారు. డ్యాబ్ సంస్థ కోసం తన వంతు సహకారం అందస్తానని తెలిపారు. అంతకు ముందు స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత, ప్రభాకర్‌రావు, పిన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, యాదయ్య, ఎంఏ. అజీజ్, డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి
Published Sun, Feb 12 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement
Advertisement