నక్సలిజం పెరగలేదు
- పెండింగ్ కేసులు పరిష్కరించాలి
- కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉత్తర తెలంగాణలో నక్సలిజం ఏమాత్రం పెరగలేదని కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, గడ్చిరోలీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నా రాష్ట్రం లోకి రాకుండా గట్టి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మట్కా, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని పోలీసుశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం పోలీసుశాఖ అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ జగన్‌మోహన్, జడ్జి గోపాలకృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ గజరావు భూపాల్, సబ్ జడ్జి అజిత్‌సింహరావులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా 1,504 వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. కేసుల నమోదు అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని అన్నారు. రంజాన్‌తోపాటు రానున్న ఆరు నెలల్లో దసరా, దీపావళి పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీసు సిబ్బందికి ఇప్పటికే కొందరికి వారంతపు సెలవులు ఇస్తున్నామని, ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పేర్కొన్నారు. ప్రత్యేక యూనిఫాం విషయంలో కూడా తమకు ఆదేశాలు రాలేదన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 6,625 ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.26.35 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
పోలీసుస్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ : ఎస్పీ
జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి తమ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. మాదారం వంటి పోలీసుస్టేషన్లను జిల్లాలో అవసరం ఉన్న చోట్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు టి. పనసారెడ్డి, భరత్ భూషన్, జోయల్ డెవిస్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.