telangana border
-
తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు
సాక్షి, అమరావతి: ఈ నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయంతో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి చెప్పారు. ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్ రాష్ట్ర సరిహద్దు అంశాలపై గురువారం ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవో, ఇతర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ మద్యం, డబ్బు అక్రమ రవాణాను నియంత్రించేందుకు తెలంగాణతో సరిహద్దు గల జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆ రాష్ట్ర అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, జీఎస్టీ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎస్ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్, ఆర్.పి.మీనా తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం చిల్లకల్లు (జగ్గయ్యపేట): తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు సమీపంలోగల భీమవరం జీఎమ్మార్ టోల్‌ప్లాజాలో గురువారం ఏపీ, తెలంగాణలకు చెందిన ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ మద్యం, నగదు అక్రమ తరలింపు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
నేడు తెలంగాణ సరిహద్దు గ్రామానికి అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లోని కర్ణాటకలోని ఓ గ్రామంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గోర్ట గ్రామంలో జరిగిన విముక్త పోరాటంలో 200 మంది గ్రామస్తులు మరణించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 75వ హైదరాబాద్ స్టేట్ విలీన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ సందర్భంగా గోర్ట గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలను అమిత్ షా ఆవిష్కరిస్తారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ùకు శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సంజయ్ స్వాగతం పలికారు. -
సరిహద్దులో పేలిన తూటా
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఇంకా చీకట్లు తొలగిపోలేదు.. చలితో మన్యం వణుకుతోంది.. ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం. అరగంటకు పైగా భీకర పోరు. సోమవారం ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ సీఆర్పీఎఫ్ జవాన్లు.. మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నలుగురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎర్రంపాడు, చెన్నాపురం, తిప్పాపురం గ్రామాల మీదుగా ట్రాక్టర్లపై ఆంజనేయపురం వరకు తరలించి, అక్కడి నుంచి రెండు అంబులెన్సుల ద్వారా భద్రాచలం మీదుగా తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అరగంట సేపు హోరాహోరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలోని పెసర్లపాడు అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి జిల్లా చర్లతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా జిల్లాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, సుకుమా జిల్లాకు చెందిన డీఆర్జీ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ బలగాలు.. భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్ నేతృత్వంలో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్‌కు బయలుదేరాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. అర్ధగంట పాటు సాగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా ప్రాంతంలో రెండు 303 రైఫిళ్లు, మూడు డీబీబీఎల్ తుపాకులతో పాటు నాలుగు రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల మండలం చెన్నాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీఆర్పీఎఫ్ క్యాంపును తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించిన పది రోజులకే భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. కాగా క్రమంగా విస్తరిస్తున్న మావోయిస్టుల ఏరివేతపై జిల్లా పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశానిర్దేశం చేశారనే చర్చ జరుగుతోంది. చర్ల టు సుకుమా..! మృతదేహాలకు పోస్టుమార్టం చేసే విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ముందు ములుగు జిల్లాకు తరలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత భారీ భద్రత నడుమ అటవీ ప్రాంతం నుంచి చర్ల వరకు మృతదేహాలను తీసుకొచ్చారు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతుందని అందరూ భావించారు. కానీ భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమాకు తరలించారు. మృతదేహాలను తరలించే సమయంలో సరిహద్దు గ్రామాలకు చెందిన ఆదివాసీలు వాహనాలను అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. కాగా చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలుసుకునే యత్నం చేస్తు న్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. చర్ల–కిష్టారం పోలీస్స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై దాడికి వ్యూహరచన చేస్తున్నట్టుగా పక్కా సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. చనిపోయిన వారంతా మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి (బీకే–టీజీ) జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ అంగరక్షకులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న రాకెట్ లాంచర్లు, తుపాకులు ఆపరేషన్ ఆజాద్ ఫలించలేదా..? ఈ ఎన్కౌంటర్ నుంచి ఆజాద్ తప్పించుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఉంటూ తెలంగాణలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆజాద్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్, ఆజాద్ ప్రొటెక్షన్ టీం సభ్యుడు మంతు ఉన్నట్లుగా తెలుస్తుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది. -
మానవతా దృక్పధంతో అంబులెన్స్‌లను అనుమతించాలి: సజ్జల
-
సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల
సాక్షి, అమరావతి: తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరమని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇది జాతీయ విపత్తు.. దీనిపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేస్తోందన్నారు. మానవతా దృక్పథంతో అంబులెన్స్‌లను అనుమతించాలని ఆయన కోరారు. తెలంగాణ హైకోర్టు చెప్పినా ఆ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా గైడ్‌లైన్స్ పెట్టడం సరికాదన్నారు.ఆస్పత్రి లెటర్, పాస్‌లు తీసుకురావడం సాధ్యం కాదని తెలిపారు. ‘‘మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉన్న నగరాలకు వెళ్లడం సహజం. గత ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయలేదు. ఎక్కడా రాని సమస్య తెలంగాణ సరిహద్దుల్లోనే వస్తుంది. ఇది మానవత్వంతో చూడాల్సిన అంశం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మాకు ఇబ్బంది కలిగించడం లేదు. హైదరాబాద్ 2024 వరకు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది. బాబు రాష్ట్రానికి వచ్చేయడంతో మేం ఆ అవకాశాన్ని కోల్పోయాం. అంబులెన్స్‌ల అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని’’ సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. చదవండి: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత YS Jagan: సీఎం జగన్ లేఖతోనే కదలిక -
తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. పంచలింగాల టోల్గేట్ వద్ద.. కర్నూలు: పంచలింగాల టోల్గేట్ తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ అంబులెన్స్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబులెన్స్ అపివేయటంతో చికిత్స అందక ఒకరు మృతి చెందారు. ఆర్టీఏ బోర్డర్ వద్ద మరికొన్ని అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులతో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడారు. అంబులెన్స్‌లను పంపించేందుకు అధికారులతో కూడా ఎమ్మెల్యే చర్చలు జరిపారు. దీంతో అంబులెన్స్‌ను అనుమతించారు. కాగా, పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. చదవండి: ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి లాక్డౌన్: సరిహద్దులు దిగ్బంధం.. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఎస్సై నేలకొరగగా నలుగురు కీలక మావోయిస్టులు మృతి చెందారు. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్దోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మాటు వేసి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై శ్యాంకిశోర్ శర్మను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మృతి చెందిన మావోయిస్టులను కాంకేర్ డివిజినల్ కమిటీ సభ్యుడు అశోక్ రైను, ఏరియా కమిటీ సభ్యుడు కృష్ణ నరేటి, ఎల్ఓఎస్ సభ్యులు సవితా సలామే, పర్మిలలుగా గుర్తించారు. వీరిలో అశోక్‌పై రూ.8 లక్షల రివార్డు, కృష్ణపై రూ.5 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ. లక్ష చొప్పన రివార్డు ఉన్నట్లు రాజ్‌నంద్‌గావ్ ఏఎస్పీ తెలిపారు. వీరికి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన పలు ఘటనలతో సంబంధముందన్నారు. ఏకే–47 రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు 12–బోర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. -
ఐదుగురు మావోల ఎన్కౌంటర్
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని దుర్వేదా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తారసపడిన మావోయిస్టులు పోలీసు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటన్నర పాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ముగిసిన అనంతరం సంఘటన ప్రాంతంలో ఒక మహిళ సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను తరలించి కూంబింగ్ ముమ్మరం చేశారు. -
దండకారణ్యానికి రహదారి మాల!
సాక్షి, హైదరాబాద్: దేశంలో తీవ్రవాద భావజాలాన్ని తగ్గించడానికి అభివృద్ధే అసలైన ఔషధం. విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలు అందితే వారిలో మార్పు తీసుకురావచ్చు. ఇదే సూత్రాన్ని తెలంగాణలో కేంద్రం అమలు చేస్తోంది. అందుకే, మావోయిస్టు ప్రాబల్య మారుమూల దండకారణ్యాల్లోనూ రోడ్లను వేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలసి రూ.1,300 కోట్ల నిధులతో 1,300 కి.మీ.ల దూరం మేర మూడు రాష్ట్రాల దండకారణ్యాలు, మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి. కిలోమీటరు రోడ్డుకు రూ.కోటి ఖర్చు చేస్తున్నాయి. పథకాలు చేరువ చేయడానికి.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆది నుంచి మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో వెనకబడ్డ ఈ మూడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలను చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు భౌగోళికంగా కలసే ప్రాంతాలను ఎంపిక చేసింది. 3 రాష్ట్రాల్లోని 8 జిల్లాలను కలుపుతూ.. ఉత్తర తెలంగాణ, ఆగ్నేయ మహారాష్ట్ర, నైరుతి ఛత్తీస్‌గఢ్ పరిధిలో ఉన్న దండకారణ్యాల్లో 1,300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాలను కలిపేందుకు రోడ్ల కోసం రూ. 1,300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా 550 కి.మీ. మేర పనులకు నిధులు విడుదల కాగా, పనులు కూడా మొదలయ్యాయి. 20 రోడ్లు, 18 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇక మిగిలిన 750 కి.మీ.లకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులు సాగుతున్నాయి. దీనికి ఆమోదం లభించగానే..ఆ పనులు కూడా మొదలవుతాయి. గోదావరిపై మూడు వారధులు.. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా 3 భారీ వంతెనలు కూడా నిర్మించాల్సి ఉంది. అవి పర్ణశాల (భద్రాద్రి కొత్తగూడెం), ముక్కనూరు (జయశంకర్ భూపాలపల్లి) వంతెనలను గోదావరి నదిపై నిర్మించనున్నారు. ఇక గోదావరికి ఉపనది అయిన మానేరుపై ఆరింద(పెద్దపల్లి) వద్ద భారీ వంతెనలను నిర్మిస్తారు. ఈ 3 కూడా కి.మీకు పైగా పొడవుంది. వీటి నిర్మాణానికి అనుమతులు కూడా వచ్చాయి. మూడు రాష్ట్రాలను కలపడంలో ఈ వంతెనలు కీలక పాత్ర పోషిస్తాయి. -
నక్సలిజం పెరగలేదు
- పెండింగ్ కేసులు పరిష్కరించాలి - కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉత్తర తెలంగాణలో నక్సలిజం ఏమాత్రం పెరగలేదని కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, గడ్చిరోలీ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నా రాష్ట్రం లోకి రాకుండా గట్టి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మట్కా, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని పోలీసుశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం పోలీసుశాఖ అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కలెక్టర్ జగన్మోహన్, జడ్జి గోపాలకృష్ణమూర్తి, జిల్లా ఎస్పీ గజరావు భూపాల్, సబ్ జడ్జి అజిత్సింహరావులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,504 వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. కేసుల నమోదు అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని అన్నారు. రంజాన్‌తోపాటు రానున్న ఆరు నెలల్లో దసరా, దీపావళి పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీసు సిబ్బందికి ఇప్పటికే కొందరికి వారంతపు సెలవులు ఇస్తున్నామని, ఈ విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పేర్కొన్నారు. ప్రత్యేక యూనిఫాం విషయంలో కూడా తమకు ఆదేశాలు రాలేదన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 6,625 ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.26.35 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్ల పునర్వ్యవస్థీకరణ : ఎస్పీ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి తమ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని ఎస్పీ గజరావు భూపాల్ అన్నారు. మాదారం వంటి పోలీసుస్టేషన్లను జిల్లాలో అవసరం ఉన్న చోట్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు టి. పనసారెడ్డి, భరత్ భూషన్, జోయల్ డెవిస్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.