
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్‌మడ్ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని దుర్‌వేదా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తారసపడిన మావోయిస్టులు పోలీసు బలగాలపైకి కాల్పులు జరిపారు.
దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటన్నర పాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ముగిసిన అనంతరం సంఘటన ప్రాంతంలో ఒక మహిళ సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను తరలించి కూంబింగ్ ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment