సాక్షి, అమరావతి: ఈ నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయంతో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి చెప్పారు. ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్ రాష్ట్ర సరిహద్దు అంశాలపై గురువారం ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల సీఎస్, డీజీపీ, సీఈవో, ఇతర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ మద్యం, డబ్బు అక్రమ రవాణాను నియంత్రించేందుకు తెలంగాణతో సరిహద్దు గల జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆ రాష్ట్ర అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆ రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, జీఎస్టీ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎస్‌ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్, ఆర్.పి.మీనా తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం
చిల్లకల్లు (జగ్గయ్యపేట): తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు సమీపంలోగల భీమవరం జీఎమ్మార్ టోల్‌ప్లాజాలో గురువారం ఏపీ, తెలంగాణలకు చెందిన ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ మద్యం, నగదు అక్రమ తరలింపు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment