'కేసులు క్లియర్ అయితేనే ఎన్నికలు'
Published Thu, Sep 8 2016 3:09 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం
ఒంగోలు కార్పొరేషన్‌లో విలీన పంచాయతీల కోర్టు కేసులు
కందుకూరులో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా కోర్టుకు...
డిసెంబర్‌లోపే ఎన్నికలంటున్న ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ జిల్లాలో ఎన్నికలు జరగాల్సిన ఒంగోలు నగరపాలక సంస్థ, కందుకూరు మున్సిపాలిటీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు అడ్డంకిగా మారుతున్నారుు. ఎన్నికలలోపు కోర్టు కేసులు క్లియర్ అవుతాయా...? క్లియర్ కాకపోతే ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉందా.. అన్న విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు కోర్టులు అడ్డంకులు చెప్పే అవకాశం తక్కువని, దాదాపు ఎన్నికలు జరగడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు.
నాలుగేళ్లుగా లేని పాలకవర్గం..
ఒంగోలు నగరపాలక సంస్థలో కొప్పోలు, త్రోవగుంట, ముక్తినూతలపాడు, పేర్నమిట్ట, వెంగముక్కపాలెం, చెరువుకొమ్ముపాలెం, పెళ్ళూరు, మంగమూరు, సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం పంచాయితీలను విలీనం చేశారు. ఇందులో మంగమూరు, సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం పంచాయతీలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లాయి. మండువవారిపాలెం పంచాయతీ కోర్టు తీర్పుతో ఏకంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను సైతం నిర్వహించుకుంది. ఇప్పటికీ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఎన్నికల సమయానికి కోర్టు క్లియరెన్స్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం. 2012కు ముందే మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థగా మారింది. విలీన పంచాయితీల కోర్టు కేసుల నేపథ్యంలో నగరపాలకకు ఎన్నికలు జరగలేదు. దీంతో అప్పటి నుంచి పాలకవర్గం ఏర్పడలేదు.
ఏడు గ్రామాల ప్రజల పోరాటం..
ఇక కందుకూరు మున్సిపాలిటీకి సైతం ఎన్నికలు జరగాల్సి ఉంది. 2012 నాటికి మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటికే కందుకూరు శివారుల్లోని ఆనందపురం, షామీర్‌పాలెం, దివివారిపాలెం, దనిగుంట, గల్లావారిపాలెం తదితర ఏడు గ్రామాలను కందుకూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు. పై గ్రామాలు కందుకూరు పట్టణానికి 5 కి.మీ. పైబడి ఉండటంతో పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయని మున్సిపల్ అధికారులు సైతం ఏడు గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లాయి. 2010 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీని వెనుక అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి మహీధరరెడ్డి ప్రోద్బలమే కారణమన్న ప్రచారం ఉంది. కోర్టు కేసులతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఆది నుంచి ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలని ఆయా గ్రామాల ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో కోర్టుకె ళ్లిన మున్సిపల్ అధికారులు కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో ఏడు గ్రామాల విలీనానికి ఆమోదం లభించింది. మున్సిపాలిటీలో విలీనం కోసం పంచాయతీ తీర్మానం సరిపోతుంది.పైగా అధికార పార్టీ మద్ధతుదారులు అధికంగా ఉండటంతో ఏడు గ్రామాల విలీనానికి ఎటువంటి అడ్డంకులు ఉండే పరిస్థితి లేదు. దీంతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
మహీధరరెడ్డి మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ సరిహద్దు నుంచి 3 కి.మీ. పరిధిలో ఉన్న గ్రామాలను మాత్రమే విలీనం చేయాలన్న జీవోను తెచ్చారు. ఈ జీవోను అడ్డుపెట్టి ఇటీవల కందుకూరు మున్సిపాలిటీకి చెందిన కొందరు ఏడు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి కోర్టుకె ళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కోర్టు తీర్పు సైతం ఎన్నికలకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు ఒంగోలు నగరపాలక సంస్థకు, కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువేనని తెలుస్తోంది.
Advertisement
Advertisement