
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యాయి. 22,805 కేసులను ఈ లోక్ అదాలత్‌లో పరిష్కరించగా, రూ.33.60 కోట్ల పరిహారం అందజేశారు. ఈ 22,805 కేసుల్లో 20,489 పెండింగ్ కేసులు కాగా, 2,316 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో 353 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు.
రాష్ట్ర హైకోర్టులో కూడా లోక్ అదాలత్ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్య మూడు బెంచ్‌లను నిర్వహించారు. మొత్తం 629 కేసులు పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, ఏపీ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఏవీ శేషసాయి ఆదేశాలు, మార్గదర్శకత్వంలో లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించామని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment