మృతుడి కుటుంబ సభ్యులకు అవార్డ్ కాపీ అందిస్తున్న జడ్జి దుర్గయ్య
సాక్షి అమరావతి/విజయవాడ లీగల్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్‌లో 15,607 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 15,045 పెండింగ్ కేసులు, 562 ప్రీ లిటిగేషన్ కేసులున్నాయి. రూ.25.50 కోట్లు పరిహారంగా చెల్లించారు. హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో 561 కేసులను పరిష్కరించారు. రూ.7.04 కోట్లు పరిహారంగా చెల్లించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ మార్గదర్శకంలో లోక్ అదాలత్ నిర్వహించినట్టు అథారిటీ సభ్య కార్యదర్శి చిన్నం శెట్టి రాజు ఓ ప్రకటనలో తెలిపారు.
యాక్సిడెంట్ కేసులో రూ.28 లక్షల పరిహారం
ఇదిలా ఉండగా విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో బాధితులకు అత్యధికంగా రూ.28 లక్షల పరిహారాన్ని పూర్తి అదనపు ఇన్‌చార్జ్ విజయవాడ నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి జి.దుర్గయ్య అందజేశారు. కృష్ణలంకకు చెందిన సమ్మెట పార్థసారథి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2018 సెప్టెంబర్ 9న ఆర్టీసీ హయ్యర్ బస్ ఢీ కొట్టడంతో మరణించారు. అతని భార్య నవ్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రూ.30 లక్షల పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది నరసింహారావు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి బాధితురాలికి రూ.28 లక్షలు పరిహారం వచ్చేలా చేశారు. బార్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో బాధితురాలికి అవార్డ్ కాపీ అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment