నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమవతి, డీసీపీ జోయెల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు.
ఇందులో రాజీ చేసుకోదలచిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, గృహహింస, చెక్‌బౌన్స్, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 1,02,611 పరిష్కారం అయ్యాయి. పార్టీలు, న్యాయవాదులు కలిసి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అనంతరం ప్రేమవతి మాట్లాడుతూ...క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు.
ఒకసారి లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగే బదులు ఒకేసారి లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్‌అదాలత్‌లలో ముఖ్య పాత్ర వహిస్తారని, పార్టీలకు సన్నిహితంగా ఉన్న కారణంగా లోక్ అదాలత్‌ల గురించి పార్టీలకు వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలని కోరారు.
కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, రెండవ అదనపు ట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవ అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కుదిరిన కొంత మందికి అవార్డు కాపీలను అందజేశారు.
1,02,611 కేసులు పరిష్కారం
ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 32 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,02,611 కేసులు పరిష్కారం అయ్యాయి. క్రిమినల్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణం, మనోరంజన్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ రైల్వే కోర్టు ప్రాంగణం, పురానీ హవేలీ కోర్టు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కుటుంబ తగాదా కేసులు–277, చెక్»ౌన్స్ కేసులు–1,615, ఎస్‌టీసీ కేసులు–98,050, సీసీ ఐపీసీ కేసులు– 2,669 పరిష్కారమయ్యాయి. అలాగే ఈ లోక్ అదాలత్‌లో రూ.3,61,97000 పరిహారం కింద చెల్లించినట్లు కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో...
రంగారెడ్డి కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి పాల్గొన్నారు. అదాలత్‌లో కేసు రాజీపడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి..ఇకపై కలిసి మెలిసి జీవించాలని వారికి సూచించారు.
ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,04,769 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి డా.పట్టాబి రామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీందర్, ఎసీపీ శ్రీధర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment