ప్రతి సమస్యకు, చిన్న చిన్న విషయాలకు తమను ఆశ్రయిస్తుండడం మంచి పద్ధతేనా అని మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పుదియ తమిళగం(పీటీ) పార్టీకి చురకలు అంటించింది.
సాక్షి,చెన్నై : ఇటీవల కాలంగా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యల్ని కూడా హైకోర్టుకు పిటిషన్ల రూపంలో చేర వేసే వాళ్లు పెరుగుతూ వస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ కేసుల పరిష్కారం భారంగా మారి ఉన్న సమయంలో, తాజాగా దాఖలు అయ్యే కొన్ని పిటిషన్లు కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాకుండా, న్యాయమూర్తులకు ఆగ్రహాన్ని సైతం తెప్పిస్తున్నాయి. ప్రజా ప్రతినిధుల్ని కలసి వినతి పత్రం ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కూడా తమ దృష్టికి తీసుకు రావడంపై ఇది వరకే హైకోర్టు అసహనం వ్యక్తం చేసి ఉంది.
తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల్ని కల్గిన రాజకీయ పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని తమ ముందుకు తీసుకురావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక, ఎన్నికల సమయం కావడంతో చీటికి మాటికి హైకోర్టును ఆశ్రయించే వాళ్లు పెరగడం తథ్యం. దీంతో న్యాయమూర్తులకు శిరోభారం తప్పదు. ఈ పరిస్థితుల్లో పుదియ తమిళం దాఖలు చేసిన పిటిషన్‌తో రాజకీయ పక్షాలకు చురకలు అంటిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ స్పందించడం గమనార్హం.
అన్నింటికీ తామేనా : గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పనిచేయడంతో పుదియ తమిళగం రెండు స్థానాల్ని దక్కించుకుంది. ఇందులో ఓ ఎమ్మెల్యే రెబల్ అవతారం ఎత్తినా, పార్టీ నేత కృష్ణ స్వామి ఒంటరిగా అసెంబ్లీలో సమరం సాగిస్తూ వచ్చారు. తాజాగా మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైంది. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల్లో తమకు కేటాయించిన టీవీ చిహ్నం ప్రజల్లో పాతుకు వెళ్లడంతో మళ్లీ ఆ చిహ్నం కోసం ప్రయత్నాల్లో కృష్ణ స్వామి పడ్డారు. ఇందు కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.
తమకు మళ్లీ టీవీ చిహ్నం కేటాయించే విధంగా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించాలని కృష్ణ స్వామి తరఫున దాఖలైన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కృష్ణస్వామి తరఫున న్యాయవాదులు తమ వాదన విన్పించారు. పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేసింది. అన్నింటికీ తామేనా అని ప్రశ్నిస్తూ, ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి విజ్ఞప్తి చేయాల్సింది పోయి పిటిషన్ దాఖలు చేయడం ఏమిటంటూ న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు.
ప్రతి చిన్న విషయాన్ని , ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన విషయాలకు కోర్టును ఆశ్రయించడం మంచి పద్ధతి కాదు అని, ముందుగా సంబంధించి అధికారుల్ని సంప్రదించాలని హితవు పలుకుతూ చురకలు అం టించారు. అక్కడ సమస్య పరిష్కారం కాకుంటే, తమ వద్దకు రావాలే గానీ, నేరుగా కోర్టుల్ని ఆశ్రయించడం మంచి పద్ధతి కాదంటూ పిటిషన్ విచారణను ముగించారు.
అన్నింటికీ మేమేనా!
Published Thu, Mar 10 2016 2:36 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement