రికార్డు స్థాయిలో రూ.743 కోట్ల చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఒకేరోజు 10,35,520 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,81,611, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 4,53,909 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.743 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను సాయంత్రం రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. రెట్టింపు ఉత్సాహంతో కేసులను పరిష్కరించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
హైకోర్టులో 132 కేసులు..
హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. హైకోర్టులో 132 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం..
రంగారెడ్డి కోర్టులు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైన కేసులతో సత్వర న్యాయంతోపాటు కక్షిదారులు చెల్లించిన కోర్టు రుసుమును కూడా తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు.
కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులగారి కృష్ణ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 33 లోక్ అదాలత్ ధర్మాసనాలు ఏర్పాటు చేయగా సుమారు లక్షా 27వేల పైచిలుకు క్రిమినల్, సివిల్ ఇతర కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు మొత్తంగా 5 కోట్ల 85 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment