సాక్షి, అమరావతి : పెండింగ్ కేసులపై పోలీసు శాఖ దృష్టి సారించింది. జిల్లాలు, సబ్ డివిజన్‌ల స్థాయిలో ప్రతి నెలా నిర్వహించే నేర సమీక్షా సమావేశం (క్రైమ్ మీటింగ్)లో కేసుల వారీగా వాటి పురోగతిపై ఆరా తీస్తోంది. వివిధ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటికి ఎదురైన అడ్డంకులు ఏమిటి, వాటిని తొలగించేలా ఇకమీదట ఏ చర్యలు తీసుకుంటున్నారనేవి విశ్లేషిస్తున్నారు. కేసుల నమోదు నుంచి దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాల సేకరణ, విచారణ వంటి అన్ని దశల్లోనూ కాలయాపన లేకుండా చర్యలు తీసుకుంటోంది. కొత్త కేసుల దర్యాప్తుతోపాటు పాత (పెండింగ్) కేసుల దుమ్ము దులిపి వాటిని పరిష్కరించేందుకు నిర్ణయించింది.
నేర నియంత్రణ, నిరూపణపై దృష్టి...
రాష్ట్రంలో నమోదవుతున్న నేరాలపై దర్యాప్తు, విచారణ, నేర నిరూపణ వంటి దశల్లో జరుగుతున్న వడపోతకు పొంతనలేని పరిస్థితి ఉంది. ప్రతీయేటా లక్షన్నరకు పైగా కేసులు నమోదు అవుతుండగా వాటిలో విచారణ పూర్తి అవుతున్నది కేవలం ఐదు నుంచి పది శాతం కేసులు మాత్రమే. ఆధారాలు లేకపోవడం, తప్పుడు ఫిర్యాదులు తదితర కారణాలతో కొన్ని కేసులు మూసివేస్తున్నారు. విచారణ పూర్తి అయినవి కొన్ని మాత్రమే ఉండటంతో దర్యాప్తులోనే మూడు వంతులకు పైగా కేసులు మిగిలిపోతున్నాయి. అయితే ఇటువంటి లోపాలను గుర్తించిన డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ కేసుల పురోగతిపై అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు అవసరమైన దిశానిర్దేశం చేశారు.
పెండింగ్ కేసులతోపాటు అన్ని తరహా కేసుల పురోగతిని నెలనెల నేర సమీక్షలో చర్చించడంలో బద్దకం వద్దని సూచించారు. ప్రతీ కేసులోనూ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నేరస్థులకు ఆలస్యం కాకుండా శిక్షలు పడి, నేరం చేయాలంటే వారు భయపడేలా చేయాలని సూచించారు. ఈ చర్యలతో నేర నియంత్రణతోపాటు నేర నిరూపణలోనూ మంచి ఫలితాలు సాధించే దిశగా రాష్ట్ర పోలీసులు నడుం కట్టారు.
పెండింగ్ కేసుల దుమ్ముదులపండి
Published Mon, Nov 11 2019 4:35 AM | Last Updated on Mon, Nov 11 2019 4:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment