కథలు చెప్పొద్దు... చట్టాలపై అవగాహన పెంచుకోండి
Published Mon, Aug 19 2013 6:47 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
కర్నూలు, న్యూస్‌లైన్: కేసుల విచారణపై కథలు చెప్పడం మాని చట్టాలపై అవగాహన పెంచుకుని పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఎస్పీ రఘురామ్‌రెడ్డి కిందిస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులను డివిజన్ల వారీగా విభజించి ఎస్సీ, ఏఎస్పీ, ఓఎస్‌డీ వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో ఆదోని, కోవెలకుంట్ల, బనగానపల్లె సర్కిళ్ల సీఐ, ఎస్‌ఐలతో ఎస్పీ, జిల్లా పోలీసు కార్యాలయంలో మంత్రాలయం, శిరివెళ్ల, బేతంచెర్ల సర్కిళ్ల అధికారులతో అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓస్‌డీ రవిశంకర్‌రెడ్డి డీపీఓలోని తన చాంబర్‌లో శ్రీశైలం, నంద్యాల సర్కిళ్ల సీఐలు, ఎస్‌ఐలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అందరితో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది అలసత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఆదోని తాలూకా సర్కిల్ పరిధిలోని కేసుల విచారణ విషయమై సిబ్బంది చెప్పిన సమాధానాల పట్ల ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. కేసు డైరీ(సీడీ)ల నిర్వహణ సరిగా లేదని, సాక్ష్యాధారాలు కూడా సరిగా సేకరించలేదని పేర్కొంటూనే తాను అడిగిన ప్రశ్నలనే కోర్టులో జడ్జి అడిగితే ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. కేసుల విచారణ విషయంలో కథలు చెప్పడం మానుకుని వాటిపై అవగాహన పెంచుకోవాలని చురకలు అంటించారు.
కేసు నమోదు చేసి మూడు నెలలు గడిచినా సీఐలు, ఎస్‌ఐలు ఎక్కువ శాతం కేసు డైరీలు రాయకపోవడం వల్ల వాటి దర్యాప్తులో పురోగతి లేక నింది తులు సులభంగా బెయిల్ పొందుతున్నారన్నారు. ఈ విధానానికి స్వస్తి చెప్పాలని సిబ్బందిని ఆదేశించారు.
మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులు, వేధింపుల వంటి సంఘటనను తీవ్రంగా పరిగణించాలన్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జీవిత కాలం రౌడీషీట్లు కొనసాగించే విధంగా చర్యలు ఉండాలన్నారు.
కౌతాళంలో కన్నతండ్రి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసు విచారణ సందర్భంగా ఎస్పీ తీవ్రంగా స్పందించా రు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి పోలీసులు తీసుకునే చర్యలు జీవితాం తం గుర్తుండేలా ఉండాలన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారిపై నిఘా తీవ్రతరం చేయాలని సూచించారు. ఇందుకోసం నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాఫిక్ సబ్‌స్టాన్స్(ఎన్‌డీపీఎస్) యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నేడు మీతో మీ ఎస్పీ
కర్నూలు, న్యూస్‌లైన్: శాంతిభద్రతల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎస్పీ రఘురామ్‌రెడ్డి ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయనే స్వయంగా ఫోన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తారు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గత వారం ఎక్కువ శాతం సివిల్ పంచాయతీలకు సంబంధించిన విషయాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. సివిల్ పంచాయతీల్లో పోలీసులు జోక్యం చేసుకోరని, వాటి వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉంటే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆది వారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, వయో వృద్ధులు, మహిళలను దృష్టిలో ఉంచుకుని మీతో మీ ఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ప్రజలు శాంతిభద్రతలపరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రమే 94407 95567 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
Advertisement