పెండింగ్‌పైనే ఫోకస్ | focus on pending cases | Sakshi
Sakshi News home page

పెండింగ్‌పైనే ఫోకస్

Published Thu, Jul 10 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

focus on pending cases

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ రేంజీ డీఐజీ భీమానాయక్ తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో 30 నుంచి 40 శాతం కేసుల విచారణ పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘రెండు జిల్లాల్లోనూ పెండింగ్ కేసులు పెరిగాయి. కరీంనగర్‌లో 2,844 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 3,274 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.

 వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం. పోలీస్‌శాఖ తరఫున కరీంనగర్ జిల్లాలో 27,188 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 14,051 కేసులు కోర్టు ట్రయల్‌లో ఉన్నాయి. వీటి విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. దీంతో ఎన్ని కేసులు ఉన్నాయి... ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? ఎవరెవరు హాజరయ్యారు? కేసు ఏ రోజుకు వాయిదా పడింది? అంటూ కేసుల పురోగతి ఏ రోజుకారోజు ఎస్పీలకు సమాచారం అందుతోంది. వెంటనే వీటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం...’ అని తెలిపారు.

బుధవారం కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గడిచిన ఆరు నెలలకు సంబంధించి నేర సమీక్ష వివరాలు డీఐజీ వెల్లడించారు. రెండు జిల్లాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. అందుకు పోలీసు యం త్రాంగం పకడ్బందీగా తగిన జాగ్రత్తలు తీసుకుందన్నారు. ‘రెండు జిల్లాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి.  ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిత్యం పోలీసు పార్టీల కూంబింగ్ జరుగుతోంది. దీంతో మన ప్రాంతంలోకి నక్సలైట్లు రాకుం డా కట్టడి చేయగలుగుతున్నాం. గడిచిన ఆరు నెలల్లో రెండు జిల్లాల్లోనూ ఇతరత్రా నేరాల సంఖ్య పెరిగింది.

కరీంనగర్‌లో 2,200 వారంట్లు, ఆదిలాబాద్‌లో 1,504 వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్ సర్టిఫికెట్లు అందక కరీంనగర్‌లో 152 కేసులు, ఆదిలాబాద్‌లో 206 కేసులు, పోస్టుమార్టం నివేదికలు అందక కరీంనగర్‌లో 110, ఆదిలాబాద్‌లో 128 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే కాకుండా కరీంనగర్‌కు సంబంధించి 162, ఆదిలాబాద్‌లో 257 ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉంది. వీటిని త్వరగా తెప్పించి కేసులను తెల్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించాం’ అని స్పష్టం చేశారు.

 ఎస్సీ, ఎస్టీ కేసులు ఫాల్స్
 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసుల్లో 80 శాతం తప్పుడు కేసులే ఉంటున్నాయని డీఐజీ తెలిపారు. ఇవన్నీ తమ పరిధిలోనే కొట్టుడుపోతున్నాయని చెప్పారు. అందుకే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని, నిజంగా అన్యాయం జరిగితేనే బాధితులు కేసులు నమోదు చేయాలని సూచించారు.

 498 (ఏ)కు అనుమతి తప్పనిసరి
 ‘మహిళలకు సంబంధించి గృహహింస కేసుల్లోనూ 498 సెక్షన్ దుర్వినియోగం అవుతోంది. దాదాపు 50 శాతం కేసులు కౌన్సెలింగ్ కేంద్రాల్లో పరిష్కారం చేస్తున్నాం. భర్తతోపాటు వారి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదుకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ కేసులు పక్కదారి పడుతున్నాయి. అందుకే భర్తను అరెస్టు చేయాల్సి వచ్చినా.. వారి కుటుంబసభ్యులను అరెస్టు చేసేందుకు ఎస్పీ అనుమతి తప్పకుండా తీసుకోవాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశాం’ అని డీఐజీ తెలిపారు.

 ఫిర్యాదుకు 30 రోజులు
 ‘పోలీసు విభాగంపై ప్రజలకు ఎంతో నమ్మకముంది. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే స్టేషన్లకు వస్తారు. అందుకే స్టేషన్లలోని రిసెప్షన్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించాలి. వాటిపై వెంటనే స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదులు పెండిం గ్‌లో పెట్టకూడదు. ఈ పద్ధతితో జవాబుదారీతనం పెరుగుతుంది. అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని డీఐజీ హెచ్చరించారు.

 క్వార్టర్లకు ప్రతిపాదనలు
 రెండు జిల్లాల్లో పోలీసు సిబ్బంది క్వార్టర్లు దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. వీటిని పూర్తిగా కూల్చివేసి.. కొత్త వాటికి ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే ఎస్పీలకు సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వం హడ్కో రుణంతో కొత్త క్వార్టర్లు నిర్మించే ఆలోచనతో ఉన్నం దున.. ఈ ప్రతిపాదనలు పంపించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement