Court monitoring System
-
సీఎంఎస్ పనితీరుపై ఢిల్లీ పోలీసుల ఆసక్తి
నగరానికి వచ్చిన స్పెషల్ పోలీసు కమిషనర్ విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లోని కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) ఇతర రాష్ట్రాల పోలీసులు ఆసక్తి చూపుతున్నారు. నమోదయ్యే కేసుల్లో తగిన సాక్ష్యాలను కోర్టు ముందుంచి శిక్షల శాతం పెంచడంలో సీఎంఎస్ కీలక భూమిక పోషిస్తోంది. ఇది గుర్తించిన ఇతర రాష్ట్రాల పోలీసులు తమ రాష్ట్రాల్లో సీఎంఎస్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని సీఎంఎస్‌కు వచ్చి పరిశీలిస్తున్నారు. అదనపు డీజీ హోదా కలిగిన ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ సత్యేంద్ర గార్గ్ ఆదివారం నగరానికి చేరుకొని సీఎంఎస్ పనితీరుపై వివరాలు సేకరించారు. డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్ కుమార్ సీఎంఎస్ పనితీరును సత్యేంద్ర గార్గ్‌కు వివరించారు. సీఎంఎస్ విజయవంతం వెనుక నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు అనుసరిస్తున్న విధానాలు, నేరాలను విశ్లేషించి శిక్షల శాతం పెంచడంలో ఇక్కడి అధికారులు చేపడుతున్న చర్యలను ఆయనకు డీసీపీ అశోక్ కుమార్ వివరించారు. సోమవారం సీఎంఎస్ పనితీరును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు. పదేళ్ల ప్రస్థానం కమిషనరేట్‌లో సీఎంఎస్ ఏర్పాటు చేసి పదేళ్లవుతోంది. రోజు రోజుకూ నేరస్తులకు శిక్షల శాతం తగ్గడాన్ని గుర్తించిన అప్పటి పోలీసు కమిషనర్ ఉమేష్ షరాఫ్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. స్టేషన్ అధికారులు, సిబ్బంది పని ఒత్తిడి కారణంగా ట్రయల్ దశలో కేసులపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడమే శిక్షల శాతం తగ్గేందుకు కారణమని ఆయన గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 2005లో దేశంలోనే తొలిసారిగా సీఎంఎస్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో సీఎంఎస్ ఇన్చార్జిగా ఏఎస్ఐ స్థాయి అధికారి ఉండేవారు. తదుపరి కాలంలో వచ్చిన పోలీసు కమిషనర్లు సీఎంఎస్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సీఎంఎస్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రారంభంలో 30 నుంచి 35శాతంగా ఉన్న శిక్షల శాతం నేడు 70 శాతానికి పైబడి ఉండటం వెనుక సీఎంఎస్ పాత్ర ఎంతగానో ఉంది. ఇతర రాష్ట్రాల ఆసక్తి నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సీఎంఎస్ ఫలితాలను పొరుగు రాష్ట్రాల పోలీసులను ఆకర్షిస్తోంది. గతంలో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పలువురు అధికారులు వచ్చి సీఎంఎస్ పనితీరును అధ్యయనం చేసి వెళ్లారు. తమ తమ రాష్ట్రాల్లో దీని ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వీరు పరిశీలించారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సైతం అన్ని జిల్లాల్లో సీఎంఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పడం కమిషనరేట్ పనితీరుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ సత్యేంద్రగార్గ్ వచ్చారు. దేశ రాజధానిలో దీని ఏర్పాటుపై ఇక్కడి అధికారులతో చర్చించారు. ఆయనను కలిసిన వారిలో డిసీపీ అశోక్ కుమార్‌తో పాటు సీఎంఎస్ ఇన్స్పెక్టర్ పి.ఇ.పవన్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
సీఎంఎస్ పనితీరు బాగుంది
డీజీపీ జేవీ రాముడు కితాబు విజయవాడ సిటీ : ‘కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీయంఎస్) పనితీరు బాగుంది. విజయవాడలో అమలుచేస్తున్న ఈ విధానం ద్వారా నేరస్తులకు శిక్షల శాతం పెరిగిందని’ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు పేర్కొన్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్లో జరిగిన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి 13 జిల్లాలకు చెందిన ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో డీజీపీ ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలను సమీక్షించారు. సమావేశంలో సీయంఎస్ పనితీరును ప్రశంసిస్తూ అధికారులు మరోసారీ సమీక్షించాలని ఆదేశించారు. ఆ తర్వాత విశాఖపట్టణం, రాజమండ్రి నగరాల్లో అమలుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు, వివిఐపిల భద్రత, మావోయిస్టుల కదలికలు, నేరాల పెరుగుదల వంటి అంశాలను సమీక్షించి జిల్లా ఎస్పీలకు దిశా నిర్దేశం చేశారు. అదనపు డీజీపీలు ఆర్పీ ఠాగూర్ (శాంతిభద్రతలు), అనురాధ (ఇంటిలిజెన్స్), ద్వారకా తిరుమలరావు (సీఐడి), సురేంద్రబాబు (గ్రేహాండ్స్), విఎస్కే కౌముది (పిఅండ్‌ఎల్), భూపతిబాబు (రైల్వేస్), ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పాల్గొన్నారు. -
పెండింగ్‌పైనే ఫోకస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పెండింగ్ కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ రేంజీ డీఐజీ భీమానాయక్ తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో 30 నుంచి 40 శాతం కేసుల విచారణ పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘రెండు జిల్లాల్లోనూ పెండింగ్ కేసులు పెరిగాయి. కరీంనగర్లో 2,844 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 3,274 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాం. పోలీస్‌శాఖ తరఫున కరీంనగర్ జిల్లాలో 27,188 కేసులు, ఆదిలాబాద్ జిల్లాలో 14,051 కేసులు కోర్టు ట్రయల్‌లో ఉన్నాయి. వీటి విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. దీంతో ఎన్ని కేసులు ఉన్నాయి... ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? ఎవరెవరు హాజరయ్యారు? కేసు ఏ రోజుకు వాయిదా పడింది? అంటూ కేసుల పురోగతి ఏ రోజుకారోజు ఎస్పీలకు సమాచారం అందుతోంది. వెంటనే వీటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం...’ అని తెలిపారు. బుధవారం కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గడిచిన ఆరు నెలలకు సంబంధించి నేర సమీక్ష వివరాలు డీఐజీ వెల్లడించారు. రెండు జిల్లాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. అందుకు పోలీసు యం త్రాంగం పకడ్బందీగా తగిన జాగ్రత్తలు తీసుకుందన్నారు. ‘రెండు జిల్లాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిత్యం పోలీసు పార్టీల కూంబింగ్ జరుగుతోంది. దీంతో మన ప్రాంతంలోకి నక్సలైట్లు రాకుం డా కట్టడి చేయగలుగుతున్నాం. గడిచిన ఆరు నెలల్లో రెండు జిల్లాల్లోనూ ఇతరత్రా నేరాల సంఖ్య పెరిగింది. కరీంనగర్లో 2,200 వారంట్లు, ఆదిలాబాద్‌లో 1,504 వారంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్ సర్టిఫికెట్లు అందక కరీంనగర్లో 152 కేసులు, ఆదిలాబాద్‌లో 206 కేసులు, పోస్టుమార్టం నివేదికలు అందక కరీంనగర్లో 110, ఆదిలాబాద్‌లో 128 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే కాకుండా కరీంనగర్‌కు సంబంధించి 162, ఆదిలాబాద్‌లో 257 ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉంది. వీటిని త్వరగా తెప్పించి కేసులను తెల్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించాం’ అని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు ఫాల్స్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసుల్లో 80 శాతం తప్పుడు కేసులే ఉంటున్నాయని డీఐజీ తెలిపారు. ఇవన్నీ తమ పరిధిలోనే కొట్టుడుపోతున్నాయని చెప్పారు. అందుకే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని, నిజంగా అన్యాయం జరిగితేనే బాధితులు కేసులు నమోదు చేయాలని సూచించారు. 498 (ఏ)కు అనుమతి తప్పనిసరి ‘మహిళలకు సంబంధించి గృహహింస కేసుల్లోనూ 498 సెక్షన్ దుర్వినియోగం అవుతోంది. దాదాపు 50 శాతం కేసులు కౌన్సెలింగ్ కేంద్రాల్లో పరిష్కారం చేస్తున్నాం. భర్తతోపాటు వారి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదుకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఈ కేసులు పక్కదారి పడుతున్నాయి. అందుకే భర్తను అరెస్టు చేయాల్సి వచ్చినా.. వారి కుటుంబసభ్యులను అరెస్టు చేసేందుకు ఎస్పీ అనుమతి తప్పకుండా తీసుకోవాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశాం’ అని డీఐజీ తెలిపారు. ఫిర్యాదుకు 30 రోజులు ‘పోలీసు విభాగంపై ప్రజలకు ఎంతో నమ్మకముంది. తమకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే స్టేషన్లకు వస్తారు. అందుకే స్టేషన్లలోని రిసెప్షన్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించాలి. వాటిపై వెంటనే స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫిర్యాదులు పెండిం గ్లో పెట్టకూడదు. ఈ పద్ధతితో జవాబుదారీతనం పెరుగుతుంది. అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని డీఐజీ హెచ్చరించారు. క్వార్టర్లకు ప్రతిపాదనలు రెండు జిల్లాల్లో పోలీసు సిబ్బంది క్వార్టర్లు దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. వీటిని పూర్తిగా కూల్చివేసి.. కొత్త వాటికి ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే ఎస్పీలకు సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వం హడ్కో రుణంతో కొత్త క్వార్టర్లు నిర్మించే ఆలోచనతో ఉన్నం దున.. ఈ ప్రతిపాదనలు పంపించాలని కోరారు. -
సత్ఫలితాలిస్తున్న కోర్టు మానిటరింగ్
నిజామాబాద్ లీగల్, న్యూస్‌లైన్ : జిల్లాలో కోర్టు మానిటరింగ్ సిస్టం ప్రారంభమైనప్పటి నుంచి కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం విజయవాడలో అమలు చేస్తున్న కోర్టు మానిటరింగ్ సిస్టంను నిజామాబాద్ జిల్లాలో మార్చి 1, 2013న ప్రారంభించింది. ఈ సిస్టం వల్ల కక్షిదారులకు, న్యాయవాదులకు సమయం వృథా కావడం లేదు. అప్పటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవికుమార్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిపూర్ణ మహేందర్‌రెడ్డి ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్ కోర్టు మానిటరింగ్ సిస్టం అమలు కోసం సమీక్ష, సమావేశాలు నిర్వహించి కోర్టు మానిటరింగ్ సిస్టం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో జిల్లాలో 25 కోర్టులు ఉండగా 23 కోర్టుల్లో కోర్టు మానిటరింగ్ సిస్టాన్ని ప్రారంభించారు. దీనికింద జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెషన్ కోర్టు జడ్జి కోర్టుల్లో ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్‌ను, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరు కోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన సాక్షులను, కోర్టువారు జారీ చేసిన సమన్లతో సాక్షులను సకాలంలో హాజరుపరుస్తారు. గడిచిన 9 నెలలల్లో జిల్లాలో ఉన్న కోర్టుల్లో సుమారు 350 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఈ పద్ధతిపై జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి 11 కేసులను పరిష్కరించారని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.పరిపూర్ణ మహేందర్‌రెడ్డి తెలిపారు. 9 హత్య కేసుల్లో 13 మందికి జీవిత ఖైదీ విధించారన్నారు.