పోలీసు కమిషనరేట్‌లోని కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) ఇతర రాష్ట్రాల పోలీసులు ఆసక్తి చూపుతున్నారు.
నగరానికి వచ్చిన స్పెషల్ పోలీసు కమిషనర్
విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లోని కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) ఇతర రాష్ట్రాల పోలీసులు ఆసక్తి చూపుతున్నారు. నమోదయ్యే కేసుల్లో తగిన సాక్ష్యాలను కోర్టు ముందుంచి శిక్షల శాతం పెంచడంలో సీఎంఎస్ కీలక భూమిక పోషిస్తోంది. ఇది గుర్తించిన ఇతర రాష్ట్రాల పోలీసులు తమ రాష్ట్రాల్లో సీఎంఎస్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని సీఎంఎస్‌కు వచ్చి పరిశీలిస్తున్నారు. అదనపు డీజీ హోదా కలిగిన ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ సత్యేంద్ర గార్గ్ ఆదివారం నగరానికి చేరుకొని సీఎంఎస్ పనితీరుపై వివరాలు సేకరించారు. డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్ కుమార్ సీఎంఎస్ పనితీరును సత్యేంద్ర గార్గ్‌కు వివరించారు. సీఎంఎస్ విజయవంతం వెనుక నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు అనుసరిస్తున్న విధానాలు, నేరాలను విశ్లేషించి శిక్షల శాతం పెంచడంలో ఇక్కడి అధికారులు చేపడుతున్న చర్యలను ఆయనకు డీసీపీ అశోక్ కుమార్ వివరించారు. సోమవారం సీఎంఎస్ పనితీరును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు.
పదేళ్ల ప్రస్థానం
కమిషనరేట్‌లో సీఎంఎస్ ఏర్పాటు చేసి పదేళ్లవుతోంది. రోజు రోజుకూ నేరస్తులకు శిక్షల శాతం తగ్గడాన్ని గుర్తించిన అప్పటి పోలీసు కమిషనర్ ఉమేష్ షరాఫ్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. స్టేషన్ అధికారులు, సిబ్బంది పని ఒత్తిడి కారణంగా ట్రయల్ దశలో కేసులపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడమే శిక్షల శాతం తగ్గేందుకు కారణమని ఆయన గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 2005లో దేశంలోనే తొలిసారిగా సీఎంఎస్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో సీఎంఎస్ ఇన్‌చార్జిగా ఏఎస్‌ఐ స్థాయి అధికారి ఉండేవారు. తదుపరి కాలంలో వచ్చిన పోలీసు కమిషనర్లు సీఎంఎస్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి సీఎంఎస్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రారంభంలో 30 నుంచి 35శాతంగా ఉన్న శిక్షల శాతం నేడు 70 శాతానికి పైబడి ఉండటం వెనుక సీఎంఎస్ పాత్ర ఎంతగానో ఉంది.
ఇతర రాష్ట్రాల ఆసక్తి
నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సీఎంఎస్ ఫలితాలను పొరుగు రాష్ట్రాల పోలీసులను ఆకర్షిస్తోంది. గతంలో కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పలువురు అధికారులు వచ్చి సీఎంఎస్ పనితీరును అధ్యయనం చేసి వెళ్లారు. తమ తమ రాష్ట్రాల్లో దీని ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వీరు పరిశీలించారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సైతం అన్ని జిల్లాల్లో సీఎంఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పడం కమిషనరేట్ పనితీరుకు నిదర్శనం. ఈ క్రమంలోనే ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ సత్యేంద్రగార్గ్ వచ్చారు. దేశ రాజధానిలో దీని ఏర్పాటుపై ఇక్కడి అధికారులతో చర్చించారు. ఆయనను కలిసిన వారిలో డిసీపీ అశోక్ కుమార్‌తో పాటు సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ పి.ఇ.పవన్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.