- డీజీపీ జేవీ రాముడు కితాబు
విజయవాడ సిటీ : ‘కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీయంఎస్) పనితీరు బాగుంది. విజయవాడలో అమలుచేస్తున్న ఈ విధానం ద్వారా నేరస్తులకు శిక్షల శాతం పెరిగిందని’ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు పేర్కొన్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో జరిగిన ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి 13 జిల్లాలకు చెందిన ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారితో డీజీపీ ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలను సమీక్షించారు. సమావేశంలో సీయంఎస్ పనితీరును ప్రశంసిస్తూ అధికారులు మరోసారీ సమీక్షించాలని ఆదేశించారు. ఆ తర్వాత విశాఖపట్టణం, రాజమండ్రి నగరాల్లో అమలుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
రాష్ట్రంలోని శాంతిభద్రతలు, వివిఐపిల భద్రత, మావోయిస్టుల కదలికలు, నేరాల పెరుగుదల వంటి అంశాలను సమీక్షించి జిల్లా ఎస్పీలకు దిశా నిర్దేశం చేశారు. అదనపు డీజీపీలు ఆర్‌పీ ఠాగూర్ (శాంతిభద్రతలు), అనురాధ (ఇంటిలిజెన్స్), ద్వారకా తిరుమలరావు (సీఐడి), సురేంద్రబాబు (గ్రేహాండ్స్), విఎస్‌కే కౌముది (పిఅండ్‌ఎల్), భూపతిబాబు (రైల్వేస్), ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పాల్గొన్నారు.