జ్యోతిప్రజ్వలన చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టుల సంఖ్య పెంపు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కి పెంచాలనే ప్రతిపాదనతోపాటు ఖాళీల భర్తీ ఫైలు కేంద్రం వద్దనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులకుగాను సీజే సహా 13 మందే ఉన్నారని, ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేంద్రం చొరవ చూపాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని సమక్షంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరినట్టు చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాకుండా సుప్రీంకోర్టు ఏమీ చేయలేదన్నారు.
తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ వేడుకలు బుధవారం రాత్రి హైకోర్టు ఆవరణలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ఆసక్తిగానే ఉందన్నారు. తెలంగాణ హైకోర్టులోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలతోపాటు ఉన్న పోస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సత్వర న్యాయం జరిగేందుకు మార్గం సులభం అవుతుందని, పెండింగ్ కేసుల భారం తగ్గుతుందన్నారు.
ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ కోసం బార్ అసోసియేషన్లు, కేంద్రంలో ఉన్న అదనపు సోలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి వంటివారు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కూడా పెండింగ్ క్లియరెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫైలు ఏదైనా వస్తే వారం రోజుల్లోనే పరిష్కరిస్తున్నారని చెప్పారు.
సత్వర న్యాయం అందించేందుకు కృషి
అడ్వొకేట్స్ అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సమీపంలో పది ఎకరాలను కేటాయించడానికి ముందుకు రావడం పట్ల జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తంచేశారు. భూమి కేటాయించడానికి అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సత్వర న్యాయం కోసం అందరూ కృషి చేయాలని.. న్యాయ మూర్తుల ద్వారానే సత్వర న్యాయం పూర్తిగా లభించదని, బార్ అసోసియేషన్, న్యాయవాదుల సహకారం అవసరమన్నారు. ఎక్కడా లేనివిధంగా మనదేశంలో లీగల్ ఎయిడ్ కోసం రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సత్వర న్యాయం అందించేందుకు సుప్రీంకోర్టు సీజే కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిపై తాను కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని జస్టిస్ రమణ వెల్లడించారు.
పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయ్..: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచాలని, అలాగే ఖాళీగా ఉన్న 11 న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యాయమూర్తులు తక్కువగా ఉన్న కారణంగా పెండింగ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోందని తెలిపారు. శనివారం కూడా కోర్టులు పనిచేస్తూ పెండింగ్ కేసుల్ని తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ.. కేసుల విచారణలో ప్రధాన న్యాయమూర్తి క్రియాశీలక నేతృత్వంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. అడ్వొకేట్స్ అకాడమీకి ప్రభుత్వం పది ఎకరాల భూమి ఇచ్చేందుకు ముందుకు రావడం హర్షణీయమని బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సత్వర న్యాయం కోసం న్యాయమూర్తుల పోస్టుల ఖాళీల భర్తీకి అందరూ కృషి చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల హైకోర్టులకు అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment