సాక్షి, హైదరాబాద్: అసలే ఎన్నికల సమయం, ఆపై బందోబస్తు, తనిఖీలతో పోలీస్ అధికారులు, సిబ్బంది బిజీగా ఉంటారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా డబ్బు, మద్యం సరఫరా, అల్లర్లు, గొడవల నియంత్రణకే సమయం సరిపోతోంది. ఇలాంటి సమయంలో జరిగే భారీ దొంగతనాలు, దోపిడీ కేసులతోపాటు మేజర్ అఫెన్స్‌ను చేధించడం కొంత కష్టమేనని పోలీస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల విభాగంలోని సిబ్బందితో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని సైతం బందోబస్తులో నిమగ్నం చేయక తప్పని పరిస్థితి. దీనితో అక్టోబర్, నవంబర్ నెలల్లో నమోదయ్యే కేసుల్లో దర్యాప్తు చాలా మేరకు పెండింగ్‌లో పడే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రతినెలా టార్గెట్‌గా...
పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రతినెలా నమోదయ్యే కేసులను మరుసటి నెల మొదటి వారంలో యూఐ (అండర్ ఇన్వెస్టిగేషన్) మేళా పేరుతో సమీక్ష నిర్వహించి వాటి దర్యాప్తును పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించేవారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో అన్ని స్టేషన్ల అధికారులు ఆయా ప్రాంతాల్లో గ్రామాల విజిటింగ్, ఎన్నికల కమిషన్ సమావేశాలు, రిటర్నింగ్ అధికారుల ఆదేశాలు అమలు చేయడం, బైండోవర్లు చేయడం, సున్నితమైన ప్రాంతాల్లో పహారా కాయడం, పారామిలిటరీ బలగాలతో సమన్వయం చేసుకోవడంతోనే రోజువారీ కార్యక్రమాలు ముగిసిపోతున్నాయి. దీనితో ఆ రోజు స్టేషన్‌లో నమోదయ్యే కేసులపై పెద్దలు దృష్టి సారించలేకపోతున్నారు.
చిన్న స్థాయిలోని పెట్టీ కేసుల నుంచి హత్య కేసులు, దోపిడీ కేసుల వరకు అదేరీతిలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అధికారులు దర్యాప్తు చేయాలనుకున్నా తగినంత సమయం లేకపోవడంతో కేసుల దర్యాప్తు పెండింగ్‌లో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చిన్నా, పెద్ద కేసులు మొత్తం కలిపి 714 కేసులు ఈ నెలన్నర నుంచి పెండింగ్‌లో పడ్డట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ కేసుల్లో తీవ్రత ఎక్కువగా లేకున్నా వీటి ప్రభావం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఎస్పీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెలన్నర కావస్తోంది...
రాచకొండ కమిషనరేట్‌లోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెల్లరీ దుకాణంలో పట్టపగలు దోపిడీకి యత్నించి దుండగులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ కేసు తీవ్రత పెద్దదే. తుపాకులతో వచ్చి బెదిరించి, అడ్డుకుంటుండగా గాల్లోకి ఫైర్ చేయడం ఆందోళన కలిగించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు అధికారులు చేధించేందుకు ప్రయత్నించినా ఎన్నికల సమయం కావడంతో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయారని రాచకొండ ఉన్నతాధికారులు తెలిపారు.
- ఖమ్మం పట్టణంలోని కమాన్‌బజార్‌లో సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఓ భవనంలో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన భవనం పూర్తిగా కూలిపోగా, చుట్టుపక్కల ఉన్న మరో ఐదు భవనాలు 50శాతం మేర పగుళ్లు వచ్చాయి. ఈ కేసు ఖమ్మం పట్టణంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇళ్లు ఖాళీ చేసిన తర్వాతరోజు పేలుళ్లు జరగడం పోలీసుల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. పైగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోవడంతో ఈ ఇంట్లో అర్ధరాత్రి జిలెటెన్‌స్టిక్స్ డంపు చేయడంతో పేలుళ్లు సంభవించాయని గుర్తించారు. కానీ ఎందుకు డంప్ చేశారు? ఈ సమయంలో పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో వీటిని స్టోర్ చేయడం వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తించలేకపోయారు. దీని వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందా అన్న అనుమానాలు పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఈ కేసులు..ఆ కేసులు...
సాధారణ సమయంలో నమోదయ్యే కేసులపై దృష్టి సారించలేని పోలీసులకు ఇటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై నమోదవుతున్న కేసులు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో 20 నుంచి 30 కేసులు నిబంధనల ఉల్లంఘన కింద సిఫారస్ అవుతున్నట్టు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. బందోబస్తులతో కుస్తీలు పడుతుంటే ఈ కేసులతో సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు ఒత్తిడిలో పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రెండు నెలలు దర్యాప్తు లేనట్టే!
Published Sun, Nov 11 2018 3:04 AM | Last Updated on Sun, Nov 11 2018 3:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment