సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక యూనిట్ అది. 4 నెలల కిందటి వరకు అధికారులు, సిబ్బంది కొరతతో తంటాలు పడింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బం ది ఉన్నారు. అయినా ఏం లాభం.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారైంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) పరిస్థితి.
4 నెలల కిందట అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమైన సీఐడీలో ప్రస్తుతం ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు నాన్ క్యాడర్ ఎస్పీ లు, 8 మంది నాన్ క్యాడర్ అదనపు ఎస్పీలు, 42 మంది డీఎస్పీలు, 50 మంది వరకు ఇన్‌స్పెక్టర్లు, 60 మందికి పైగా సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. అయినా కీలక కేసులు ముందుకు కదలడం లేదు. 2016లో లీకైన ఎంసెట్ ప్రశ్నాపత్రం కేసుకు సంబంధించి ఇప్పటివరకు చార్జిషీట్ నమోదు కాలేదు.
2017 ఫిబ్రవరిలో నమోదైన బోధన్ స్కాం ఇప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తునకు నోచుకోలేదు. ఇలాంటి కీలక కేసులు మరో 18 వరకు ఉండగా, ఇతర కేసులు 1,200లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది ఉన్నా దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెలలు కాదు.. ఏళ్ల నుంచి కుస్తీ..
ప్రస్తుతం సీఐడీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది డీఎస్పీల్లో సగం మందికి పెద్దగా కేసులే లేవు. మిగిలిన అధికారులు పాత కేసులతో నెలలు కాదు.. ఏళ్ల నుంచి కుస్తీ పడుతూనే ఉన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ముగ్గురు, నలుగురు అధికారులు మారడంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఎంసెట్, బోధన్, ఇందిరమ్మ ఇళ్లు, సీఎంఆర్‌ఎఫ్.. ఇలా అన్ని కీలక కేసుల్లోనూ ఇదే పరిస్థితి. కొన్నింటిలో రాజకీయ ఒత్తిడి ఉంటే.. మరికొన్ని దర్యాప్తు అధికారుల వైఖరితో పెండింగ్‌లో పడుతూ వస్తున్నాయి. ప్రస్తుత దర్యాప్తు అధికారులపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment