అప్‌డేట్‌ కారా? | District Police units that do not have at least websites set up | Sakshi
Sakshi News home page

అప్‌డేట్‌ కారా?

Published Sun, Sep 9 2018 4:52 AM | Last Updated on Sun, Sep 9 2018 4:52 AM

District Police units that do not have at least websites set up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోలీస్‌ శాఖ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. అయితే ఇది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లకు మాత్రమే పరిమితం. విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన యాప్స్, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ తదితరాలన్నీ ఈ కమిషనరేట్ల పరిధిలో సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు పోలీస్‌ శాఖ వీటిని రాష్ట్రవ్యాప్తం చేసేలా అడుగులు వేస్తోంది. కానీ కొన్ని జిల్లాల పోలీస్‌ అధికారులు, కమిషనర్లు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆ జిల్లా పోలీస్‌ విభాగానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించుకోలేని దుస్థితిలో ఉండటమే ఇందుకు కారణం.  

రెండేళ్లు గడిచిపోతున్నా... 
టెక్నాలజీతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే జిల్లాల్లోని అధికారులు ఇంకా మూస పద్ధతినే అనుసరిస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌ ఏర్పడి దాదాపు మూడున్నరేళ్లు కావొస్తున్నా కనీసం వెబ్‌సైట్‌ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులెవరు? ఏ ప్రాంతం ఏ స్టేషన్‌ కిందకు వస్తుంది? అధికారి ఎవరు, ఫిర్యాదెలా చేయాలి? సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులెలా చేయాలి? క్రైమ్‌ కంట్రోల్‌కు ఎలా సహకరించాలి? నేరాల నమోదు.. తదితరాలన్నింటిని ప్రజలకు తెలిపాల్సి ఉంటుంది. ఎస్పీలు, కమిషనర్లు మారుతున్నారు తప్ప వెబ్‌సైట్‌ అందుబాటులోకి రావడంలేదు. నూతన జిల్లాల్లో చాలా వాటి పరిస్థితి మరీ దారుణం. జిల్లా ఎస్పీకి నేరుగా ఫోన్‌ ద్వారా సమాచారం అందించేందుకు కనీసం మొబైల్‌ నంబర్‌ కూడా దొరకని పరిస్థితి. పాత జిల్లా అయినా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ పోలీస్‌ కూడా సొంత వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకోలేదు. నల్లగొండ జిల్లా పోలీస్‌కు వెబ్‌సైట్‌ ఉన్నా అది అందుబాటులోకి రావడం లేదు. కొత్తగా ఏర్పడిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట్‌ కమిషనరేట్ల వెబ్‌సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం, వరంగల్‌ మాత్రం ఇంకా వెబ్‌çసైట్‌ ఏర్పాటు చేసుకోలేదు. రాజన్న సిరిసిల్లకు వెబ్‌సైట్‌ ఉన్నా డీజీపీ, డీఐజీ, ఎస్పీలు మారినా ఇంకా పాత వారి పేరిటే దర్శనమిస్తోంది.  

సీఐడీయే ఇలా చేస్తే... 
క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగం(సీఐడీ) వ్యవహారం ఉన్నతాధికారులకే అర్థం కాకుండా ఉంది. అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు నోడల్‌ కేంద్రంగా సీఐడీ పనిచేస్తుంది. ప్రతీ ఏటా క్రైమ్‌ కంట్రోల్, అనాలసిస్‌ పైన నివేదికలిస్తుంది. అలాంటి సీఐడీ ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.  

మూలనపడ్డ సోషల్‌ మీడియా ఖాతాలు.. 
కొన్ని జిల్లాల్లో పోలీస్‌ అధికారులు పక్క జిల్లాలను చూసి హడావుడిగా సోషల్‌ మీడియాలో ఖాతాలు తెరిచి కొన్ని వీడియోలు, ఫొటోలు షేర్‌ చేసి వదిలేశారు. మళ్లీ వాటిని ఉపయోగించిన దాఖలాల్లేవు. ఒక్క తెలంగాణ స్టేట్‌ పోలీస్, కరీంనగర్, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్‌ పోలీస్‌ ఫేస్‌బుక్‌ ఖాతాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నాయి. మిగతా యూనిట్లు కార్యక్రమాలు చేసినప్పుడో, పండుగలు వచ్చినప్పుడో తప్ప పెద్దగా పట్టించుకోవడంలేదని పోలీస్‌ శాఖ గుర్తించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement