సాక్షి, హైదరాబాద్: కేసు నమోదవుతుంది.. కానీ నిందితులెవరో తెలియదు.. మరో కేసులో నిందితులు ఉంటారు.. కానీ వాళ్ల జాడ తెలీదు.. ఇంకో కేసులో నిందితులు అరెస్టవుతారు.. కానీ ప్రధాన నిందితులు, సూత్రధారులు ఉండరు.. ఇది రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక విభాగం అయిన సీఐడీ దర్యాప్తు తీరు..
సీఐడీలో ఏళ్లకేళ్లు పెండింగ్‌లో ఉన్న కేసుల క్లియరెన్స్ కోసం 2 నెలల కిందట కార్యాచరణ ప్రకటించారు. 2 వేలకు పైగా ఉన్న కేసులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ నిర్దేశించుకున్నారు. దీంతో అప్పుడెప్పుడో జరిగిన కేసులో దొంగల వేట సాగిస్తున్నారు. పెండింగ్ కేసుల్లో నిందితుల జాడ కోసం తంటాలు పడుతున్నారు. ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో తెలియక సతమతమవుతున్నారు.
దొంగా దొంగా.. నీవెక్కడ?
పదకొండేళ్ల క్రితం మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్లు దండుకొని పరారైన కేసును ప్రస్తుతం సీఐడీ విచారిస్తోంది. ప్రధాన నిందితుని ఆచూకీ కోసం వేట సాగిస్తోంది. మిగతా నిందితులను పట్టుకున్నా ఏ1 వ్యక్తి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. ఇలా ఈ ఒక్క కేసే కాదు.. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న 9 కేసుల్లోనూ ఇదే పరిస్థితి. లాటరీ స్కాం పేరుతో దోచుకున్న కేసులో ఐపీ అడ్రస్ ఛేదించినా, వెబ్‌సైట్ ఎవరిదో, సర్వర్ ఎక్కడిదో గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. అసలు నిందితులు దక్షిణాఫ్రికా, ఉగాండా, నైజీరియా దేశా ల్లో ఉంటున్నట్లు గుర్తించినా అరెస్టు అవకాశాలు లేకుండా పోయాయి.
సీఎంఆర్‌ఎఫ్ స్కాం దొంగలెవరు?
చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) స్కాం దర్యాప్తు చేసిన సీఐడీ కొంతమంది చిన్నాచితకా ఆరోగ్యమిత్రలు, బ్రోకర్లను అరెస్ట్ చేసింది. కానీ ప్రధాన నిందితులు, సూత్రధారులెవరో ఇప్పటివరకు తేల్చలేకపోయింది. సీఎంఆర్‌ఎఫ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై పదే పదే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చింది. తీరా చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో కేసులో పెద్దగా ఆధారాల్లేవని, మిగతా నిందితులు లేరంటూ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
ఎంసెట్ కేసులోనూ..
2015 ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ స్కాంలోనూ 18 మంది నిందితుల్ని గుర్తించారు. కేసు దేశవ్యాప్తంగా తెలియడంతో నిందితులంతా జారుకున్నారు. ఇలాంటి కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం అత్యంత ప్రాధాన్యం. రెండేళ్ల నుంచి చేస్తున్న దర్యాప్తు ఎన్నో మలుపులు తిరిగింది. కీలక నిందితులు మృతి చెందారు. అరెస్టు సమయంలో సీఐడీ వేగం తగ్గించడం, పూర్తిగా దర్యాప్తు ఆపేయడంతో నిందితులు విదేశాలకు వెళ్లారన్న అనుమానాలకు తావిస్తోంది. 18 మంది నిందితుల కోసం ఢిల్లీ, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వేట సాగిస్తున్నా లాభం లేకుండా పోయింది.
కేసు ఉంది? నిందితులెవరు?
2014లో ఇందిరమ్మ ఇళ్ల నిధులపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. హడావుడిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ పెద్దగా ఆధారాలు లభించలేదు. స్కాంలో ప్రజాప్రతినిధులు.. అధికారులు.. ఎవరిని నిందితులుగా చేర్చాలన్న మీమాంసలో ఎవరి పేరు చేర్చలేకపోయారు. రెండేళ్లు దర్యాప్తు చేసిన అధికారులు కేసు మూసేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం ఆరోపించిన అంశాలకు తగిన ఆధారాల్లేవంటూ కేసు మూసేయడానికి అనుమతివ్వాలని పేర్కొన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment