Rachakonda commissionerate
-
Crime: పొలాల్లో మాయం.. OLXలో ప్రత్యక్షం!
హైదరాబాద్, సాక్షి: పొలాల గట్ల వెంట.. వ్యవసాయ బావుల వద్ద సేదతీరే ట్రాక్టర్లే వాళ్ల టార్గెట్. గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేస్తారు. ఆపై సెకండ్ హ్యాండ్ కింద ఆన్లైన్లోనే దర్జాగా వాటిని అమ్మేస్తారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. హైదరాబాద్ శివారుల్లో చోటు చేసుకున్న సరికొత్త చోరీల కేసుల్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు. ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే సంపంగి మహేష్.. ఉర్సు వెంకన్నలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు దిగారు. రాత్రుల్లో బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేవారు. ఆ తర్వాత వాటిని నేరుగా అమ్మితే దొరికిపోతామని ఓఎల్ఎక్స్ తరహా ఆన్లైన్ సైట్లలో అమ్మకానికి ఉంచారు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో.. మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్ 31న ట్రాక్టర్ దొంగతనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరి నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు.. నల్గొండలో ఒకటి.. నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. -
మహిళల భద్రతకు పెద్దపీట
నాగోలు: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ.. దాడులకు గురైన మహిళలకు బాసటగా నిలిచేలా భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ (సీడీఈడబ్ల్యూ) ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళ భద్రత కోసం ఈటీమ్స్ పనిచేస్తూన్నాయని తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆదుకోవడానికి మేం ఉన్నాం అన్న భరోసా కలి్పస్తామని పేర్కొన్నారు. మహిళల సౌకర్యార్థం నగరంలోని కమిషనరేట్లలో పరిధిలో 26 సీడీఈబ్ల్యూ సెంటర్ ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ప్రతి ప్రధాన సబ్ డివిజన్లో సీడీఈడబ్ల్యూ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు స్థానిక పోలీస్ స్టేషన్లో, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించే వారని తెలిపారు. కౌన్సెలింగ్ చాలా ప్రొఫెనల్ సబ్జెక్ట్, వృత్తిపరమైన సహాయం పొందడానికి కౌన్సెలర్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన నేరాలలో గృహహింస ఒకటి అనిపేర్కొన్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత, మహిళా రక్షణ, మహిళల భద్రత, గృహ హింస, ఇతర వేధింపుల రక్షణ కల్పించేందుకు కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారన్నారు. ఆన్లైన్, ఆన్‌రోడ్ ఈవ్‌టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్ఫిల్్మను రూపొదిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రతకు, భరోసా ఇవ్వడానికి రాచకొండ పోలీస్‌లు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో మహిళా భద్రత డీసీపీ శ్రీబాల, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, షీ టీమ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మహిళా పీఎస్ సీఐ మంజుల, ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తాట తీస్తున్నారు! 10 వారాల్లో 106 మంది అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధించే పోకిరీలకు రాచకొండ పోలీసులు చెక్ పెడుతున్నారు. వారిని పట్టుకోవడం..శిక్షించడంలో ఏమాత్రం ఉపేక్షించడం లేదు. తీవ్రతను బట్టి అప్పటికప్పుడే వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నారు. గత పది వారాలలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 82 కేసులు నమోదు కాగా.. ఇందులో 29 ఎఫ్ఐఆర్లు, 36 పెట్టీ కేసులు, 17 కౌన్సిలింగ్ కేసులున్నాయి. ఆయా కేసులలో 106 మంది ఈవ్ టీజర్లను అరెస్టు చేశారు. వీరిలో 65 మంది మేజర్లు, 41 మంది మైనర్లున్నారు. ఆయా పోకిరీలకు శనివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ ఆఫీసులో రాచకొండ షీ టీమ్స్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్తంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అనధికారిక అనాథాశ్రమాలు.. ముస్కాన్–8 లో భాగంగా రాచకొండ షీ టీమ్స్.. అనధికారిక అనాథ పిల్లల గృహాలను గుర్తించారు. మేడిపల్లి శాంతినగర్‌లోని ఆశ కుటీర్ బాయ్స్ హోమ్, కాకతీయనగర్‌లోని వివేకానంద అనాథాశ్రమం, కాచవానిసింగారంలోని బాలవికాస్ చిల్డ్రన్స్ హోమ్స్, జవహర్‌నగర్ క్రాస్ రోడ్‌లోని విజన్ఇండ్ ఫౌండేషన్లను గుర్తించి మూసేశారు. అందులోని 50కి పైగా అనాథలను ప్రభుత్వ హోమ్స్‌కు తరలించారు. అలాగే మెట్రో రైళ్లలో షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళల బోగిలో చొరబడిన 8 మంది పోకిరీలను పట్టుకున్నారు. ఆయా మెట్రో స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 10 వారాలలో రాచకొండ షీ టీమ్స్ 4 బాల్య వివాహాలను అడ్డుకుంది. కాగా ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులను ఉపేక్షించకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, షాపింగ్ మాళ్లు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ఎక్కడైనా సరే మహిళలను వేధిస్తే వెంటనే 94906 17111 నంబరులో లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. (చదవండి: నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..!) -
హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల విడుదల ఒకవైపు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కార్యాలయాల పునఃప్రారంభం మరోవైపు.. దీంతో వసతి గృహాలకు పూర్వ వైభవం వచ్చింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సెప్టెంబర్ మొదటి వారంలో పెయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టళ్లు, వసతి గృహాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. భద్రతా నిబంధనలు పాటించని హాస్టళ్లకు నోటీసులు జారీ చేస్తారు. రెండు వారాల్లో ఆయా ఏర్పాట్లు చేయని వసతి గృహాలను సీజ్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్త్రీ, పురుష హాస్టళ్లకు కెమెరాలు ఒకటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1,200 వసతి గృహాలు ఉన్నాయని, వీటన్నింటినీ మహిళా భదత్రా విభాగం, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో తనిఖీ చేయనున్నట్లు ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా ఏదుల తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఎవరు నిర్వహిస్తున్నారనేది కూడా ముఖ్యమే అన్నారు. సైబరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పురుషులు, మహిళల వసతి గృహాల యజమాని రెండు హాస్టళ్లలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, అయితే కానీ వాటి రికార్డ్ రూమ్‌ను మాత్రం జెంట్స్ హాస్టల్స్‌లోని పురుషులే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామన్నారు. వెంటనే వాటిని సీజ్ చేసి, యజమానిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాచకొండలో 800 హాస్టల్స్.. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 800 వసతి గృహాలు ఉన్నాయని మహిళా భద్రతా విభాగం పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో ఆయా హాస్టళ్లను రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్కేఎస్సీ) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం లేకపోతే నోటీసులు జారీ చేస్తామన్నారు. 10 నిబంధనలు పాటించాల్సిందే... ►హాస్టల్ ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద యాక్సెస్ కంట్రోల్ ఫీచర్లుండాలి. ►కనీసం 5 అడుగుల ఎత్తు, అంతకంటే ఎత్తులో ప్రహరీ ఉండాలి. ►ప్రవేశం ద్వారం వద్ద 24/7 సెక్యూరిటీ గార్డు ఉండాలి. ►విజిటర్స్ రిజిస్టర్ మెయిన్‌టెన్ చేయాలి. ►ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరా ఉండాలి. ►అగ్నిప్రమాద నియంత్రణ ఉపకరణాలు ఉండాలి. ►నోటీసు బోర్డు, ప్రథమ చికిత్స కిట్, ఫిర్యాదులు, సూచనల బాక్స్ ఉండాలి. ►వసతి గృహంలో పనిచేసే కార్మికులకు గుర్తింపు కార్డులు ఉండాలి. ►హాస్టల్లోని ప్రతి ఒక్కరికీ లాకర్ ఉండాలి. ►ధ్రువీకరించుకోకుండా ఎవరికీ వసతిని కల్పించకూడదు. -
రాచకొండ కమిషనరేట్లోకి గుండాల ఠాణా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గుండాల పోలీసుస్టేషన్‌ను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాచకొండ పరిధిలోని 3 డివిజన్లలో ఒకటైన యాదాద్రి డివిజన్లోని భువనగిరి జోన్ కింద ఈ పీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను రాచకొండకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాల పునర్విభజనకు ముందు గుండాల మండలం నల్లగొండ జిల్లాలో ఉండేది. పునర్విభజన సమయంలో గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో కలిపారు. ఈ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించడంతో గుండాలను యాదాద్రి జిల్లాలో కలిపారు. గుండాల పోలీస్ స్టేషన్‌ను మాత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోనే ఉంచారు. యాదాద్రి–భువనగిరిలోని తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్ పోలీస్ స్టేషన్లు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండగా.. ఒక్క గుండాల మాత్రమే వరంగల్ సీపీ పరిధిలో ఇప్పటివరకు ఉన్నది. (క్లిక్: పోలీసు వెబ్సైట్ ద్వారానే లైసెన్సుల రెన్యువల్) -
భూ వివాదం: సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
చౌటుప్పల్: భూవివాదంలో తలదూర్చినందున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్. వెంకన్నగౌడ్, ఎస్ఐ నర్సయ్యపై సస్పెషన్ వేటు పడింది. అదే విధంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు చార్జ్ మెమో జారీ అయింది. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలో 2.33 ఎకరాల భూమికి సంబంధిం వివాదం నెలకొంది. దాంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భువనగిరి కోర్టు పట్టాదారుడికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. సదరు కోర్టు ఉత్తర్వులను ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం భూమికి యజమానిగా ఉన్న వ్యక్తి ఇటీవల రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను ఆశ్రయించాడు. దాంతో కమిషనర్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో సీఐ, ఎస్ఐని సస్సెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ఏసీపీ సత్తయ్యకు మెమో జారీ చేశారు.(చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!) కోర్టు ఉత్తర్వులు ఉన్నా బెదిరించారు: గౌరీబట్ల సురేందర్, బాధితుడు నాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థానిక సీఐ, ఎస్ఐ బెదిరించారు. తాళ్లసింగారం గ్రామంలో 2012 సంవత్సరంలో కొనుగోలు చేసిన 2.33 ఎకరాల భూమి నాపేరిట ఉంది. నేను ఎవరికీ అగ్రిమెంటు చేయలేదు. కానీ కొంత మంది తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దాంతో స్థానిక పోలీసు లను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లాను. భువనగిరి కోర్టు నాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సీఐ, ఎస్ఐ నన్ను బెదిరించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలను సీపీ మహేష్ భగవత్‌కు అందజేయగా విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్నారు. -
నగరంలో ఆన్లైన్ కేంద్రంగా వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలంలో వంశీ రెడ్డి అలియాస్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకులు అంజలి, చిన్నాలు పరారీలో ఉన్నారు. నిందితులు నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా బారి నుంచి నలుగురు యువతులను పోలీసులు రక్షించారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కాగా.. మరో యువతి స్వస్థలం విజయవాడగా గుర్తించారు. -
రోహింగ్యాలకు కరోనా లేదు: రాచకొండ సీపీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. బుధవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిలో ఒకరు మరణించగా ఆరుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో వైరస్ ప్రభంజనానికి వేదికగా నిలిచిన నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించామన్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ఎవరూ అపోహలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాచకొండ పరిధిలో జిల్లా సరిహద్దులు ఉన్నందున అక్కడ పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసర ప్రయాణాలకు అనుమతించే పాస్‌లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే పాస్‌లపై ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. మే 7 వరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. (‘చిరుత’ వీడియో ఆకతాయిల పనే!) -
పోలీసుల్ని ప్రజలకు దగ్గర చేశాం
సాక్షి, హైదరాబాద్: దండనీతిని పక్కనబెట్టి, ప్రజలకు పోలీసులను చేరువ చేయగలిగామని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో నూతనంగా నిర్మించిన రాచకొండ కమిషనరేట్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, కమిషనర్ మహేశ్ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పోలీసు ఠాణాకు రావాలంటే.. జనాలు జంకేవారు. నేడు పోలీసులను మిత్రులుగా భావించి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఇటు నేరాల్ని నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. రాచకొండ కమిషనరేట్‌ను రూ.5.1 కోట్లతో కేవలం 18 నెలల కాలంలో పూర్తి చేయడం గొప్ప విషయం. భవిష్యత్‌లో ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేపడతాం. ఏ రాష్ట్రానికైనా శాంతి భద్రతలే కీలకం. అందుకే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.700 కోట్లు కేటాయించి గస్తీకి పెద్దపీట వేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్ వన్‌గా ఉంది. ఇటీవల కేరళ సీఎం వచ్చి పంజగుట్ట పోలీస్ ఠాణాను సందర్శించి ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే 18 వేల ఖాళీలు భర్తీ చేస్తాం. రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్. 13 నియోజకవర్గాలు, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న కమిషనరేట్‌లో మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, పోలీసులు సమన్వయం పనిచేసి మంచిపేరు తేవాలి..’అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు.. పోలీసుల రికార్డులను భద్రపరిచేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ భవనంలో మొదటిసారిగా ఆటోమేటెడ్ రికార్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏఆర్‌ఎమ్‌ఎస్) సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. పుణేలోని టెక్–మార్క్ ఆటోమేషన్ సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. కానిస్టేబుల్ నుంచి కమిషనర్‡ వరకు.. అందరి సర్వీసు బుక్‌లు, పాలనా రికార్డులన్నీ ఏఆర్ఎంఎస్లో భద్రపరుస్తారు. రికార్డుల పూర్తి వివరాలను పీడీఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీని ఏఆర్ఎమ్ఎస్లోని కంప్యూటర్లో, ఆటోమేటిక్‌గా పనిచేసే ర్యాక్‌లో మ్యాన్యువల్ రికార్డులను ఉంచుతారు. అగ్నిప్రమాదం సంభవించినా, నీళ్లు పడినా ఎలాంటి నష్టం సంభవించకపోవడం ఈ ఏఆర్ఎంఎస్ ప్రత్యేకత. ఏఆర్ఎమ్ఎస్లో రికార్డులను పరిశీలించేందుకు కమిషనరేట్ కార్యాలయంలో పరిపాలనా విభాగం ముఖ్య అధికారులకు ప్రత్యేక పాస్వర్డ్లు, యూజర్ ఐడీలను కేటాయించి, ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజల హృదయాలు గెలుచుకోవాలి: డీజీపీ పోలీసులు మెరుగైన పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకోవాలని డీజీపీ మహేందర్ అన్నారు. ‘సీఎం కేసీఆర్ ఆశయాలను సాధించడంలో తెలంగాణ పోలీసులు సఫలీకృతులయ్యారు. నగరంలో శాంతి భద్రతలకు సీఎం పెద్దపీట వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టి, 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందుకోసం పేద, ధనిక వర్గాలు ముందుకు రావడం అభినందనీయం. కేవలం గస్తీకే రూ. 350 కోట్లతో 11 వేల వాహనాలను సీఎం పోలీసుశాఖకు కేటాయించారు. ఈ కమిషనరేట్ ఏర్పాటు వల్ల సైబరాబాద్‌పై భారం తగ్గుతుంది’ అని వ్యాఖ్యానించారు ఏఆర్ఎమ్ఎస్తో క్షణాల్లో రికార్డులు: సీపీ కేవలం 18 నెలల్లోనే కమిషనరేట్‌ను పూర్తి చేసినందుకు టీఎస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎండీ మల్లారెడ్డికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఏఆర్ఎమ్ఎస్ను ఇక్కడ ప్రవేశపెట్టాం. దీని సాయంతో అన్ని రికార్డులను క్షణాల్లో చూడొచ్చు. మేడిపల్లి వద్ద ప్రభుత్వం కమిషనరేట్‌కు 50 ఎకరాలు, యాదగిరిగుట్ట వద్ద పోలీసు శిక్షణ కేంద్రానికి మరో 36 ఎకరాలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు’ అని అన్నారు. -
తుపాకీతో హల్చల్.. బంగారం చోరికి యత్నం
సాక్షి, మేడ్చల్: తుపాకితో బెదిరించి బంగారు దుకాణంలో చోరికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ ఘటన జవహర్ నగర్, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దుమ్మాయిగూడలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఉన్న జ్యువెలరీ షాప్‌లో ఆరుగురు అగంతకులు తుపాకితో బెదిరించి చోరికి ప్రయత్నించారు. చోరీ సమయంలో ముఠా సభ్యులు అక్కడ ఉన్నవారిని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న సమయంలో రోడ్డుపైన వెళ్తున్న వ్యక్తిని బెదిరించి బైక్ లాక్కుని ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ చోరికి యత్నించింది అంతర్ రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. అయితే జ్యువెలరీ షాప్‌లో బంగారం ఎంత చోరికి గురైందో తెలియాల్సివుంది. -
అప్డేట్ కారా?
సాక్షి, హైదరాబాద్: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోలీస్ శాఖ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. అయితే ఇది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు మాత్రమే పరిమితం. విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన యాప్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ తదితరాలన్నీ ఈ కమిషనరేట్ల పరిధిలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పోలీస్ శాఖ వీటిని రాష్ట్రవ్యాప్తం చేసేలా అడుగులు వేస్తోంది. కానీ కొన్ని జిల్లాల పోలీస్ అధికారులు, కమిషనర్లు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆ జిల్లా పోలీస్ విభాగానికి ప్రత్యేక వెబ్సైట్ రూపొందించుకోలేని దుస్థితిలో ఉండటమే ఇందుకు కారణం. రెండేళ్లు గడిచిపోతున్నా... టెక్నాలజీతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే జిల్లాల్లోని అధికారులు ఇంకా మూస పద్ధతినే అనుసరిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ ఏర్పడి దాదాపు మూడున్నరేళ్లు కావొస్తున్నా కనీసం వెబ్సైట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులెవరు? ఏ ప్రాంతం ఏ స్టేషన్ కిందకు వస్తుంది? అధికారి ఎవరు, ఫిర్యాదెలా చేయాలి? సైబర్ క్రైమ్ ఫిర్యాదులెలా చేయాలి? క్రైమ్ కంట్రోల్‌కు ఎలా సహకరించాలి? నేరాల నమోదు.. తదితరాలన్నింటిని ప్రజలకు తెలిపాల్సి ఉంటుంది. ఎస్పీలు, కమిషనర్లు మారుతున్నారు తప్ప వెబ్సైట్ అందుబాటులోకి రావడంలేదు. నూతన జిల్లాల్లో చాలా వాటి పరిస్థితి మరీ దారుణం. జిల్లా ఎస్పీకి నేరుగా ఫోన్ ద్వారా సమాచారం అందించేందుకు కనీసం మొబైల్ నంబర్ కూడా దొరకని పరిస్థితి. పాత జిల్లా అయినా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ పోలీస్ కూడా సొంత వెబ్సైట్ ఏర్పాటు చేసుకోలేదు. నల్లగొండ జిల్లా పోలీస్‌కు వెబ్సైట్ ఉన్నా అది అందుబాటులోకి రావడం లేదు. కొత్తగా ఏర్పడిన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట్ కమిషనరేట్ల వెబ్సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం, వరంగల్ మాత్రం ఇంకా వెబ్çసైట్ ఏర్పాటు చేసుకోలేదు. రాజన్న సిరిసిల్లకు వెబ్సైట్ ఉన్నా డీజీపీ, డీఐజీ, ఎస్పీలు మారినా ఇంకా పాత వారి పేరిటే దర్శనమిస్తోంది. సీఐడీయే ఇలా చేస్తే... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం(సీఐడీ) వ్యవహారం ఉన్నతాధికారులకే అర్థం కాకుండా ఉంది. అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణకు చేపట్టే కార్యక్రమాలకు నోడల్ కేంద్రంగా సీఐడీ పనిచేస్తుంది. ప్రతీ ఏటా క్రైమ్ కంట్రోల్, అనాలసిస్ పైన నివేదికలిస్తుంది. అలాంటి సీఐడీ ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మూలనపడ్డ సోషల్ మీడియా ఖాతాలు.. కొన్ని జిల్లాల్లో పోలీస్ అధికారులు పక్క జిల్లాలను చూసి హడావుడిగా సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి కొన్ని వీడియోలు, ఫొటోలు షేర్ చేసి వదిలేశారు. మళ్లీ వాటిని ఉపయోగించిన దాఖలాల్లేవు. ఒక్క తెలంగాణ స్టేట్ పోలీస్, కరీంనగర్, రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ ఫేస్బుక్ ఖాతాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. మిగతా యూనిట్లు కార్యక్రమాలు చేసినప్పుడో, పండుగలు వచ్చినప్పుడో తప్ప పెద్దగా పట్టించుకోవడంలేదని పోలీస్ శాఖ గుర్తించింది. -
చెంగిచర్ల ఘటనలో ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: చెంగిచర్ల వద్ద ఆయిల్ ట్యాంకర్ల పేలుడు, అగ్నిప్రమాదం సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్ల యజమానులు రాజు, జగదీష్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 3 బైక్‌లు, 2 కార్లు, 12 పెట్రోల్ ట్యాంకర్లు, రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దక్షిణ భారతంలోనే మొదటిదని రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ల నుంచి పెట్రోల్ తీస్తుండగా ప్రమాదం సంభవించిందని, ఇలా తీసిన పెట్రోల్‌లో కిరోసిన్ కలిపి విక్రయిస్తుంటారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో వీరు అక్రమంగా కార్ఖానా నిర్వహిస్తున్నారన్నారు. చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల నుంచి వెల్డింగ్ ద్వారా పెట్రోల్ తొలగించే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని జోషి తెలిపారు. -
‘విక్టోరియా’ లీజు భారీగా తగ్గింపు
- రాచకొండ కమిషనరేట్ భూమి లీజు రుసుములో మార్పులు - రూ.94 లక్షల నుంచి 5 లక్షలకు నెలవారీ లీజు తగ్గింపు సాక్షి, హైదరాబాద్: విక్టోరియా మెమోరియల్ హోమ్ ట్రస్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ట్రస్టుకు సంబంధించిన భూములను ఒక్కో విభాగానికి లీజు రూపంలో కేటాయించడంతో హోమ్ ఉనికి గందరగోళంగా మారింది. తాజాగా లీజు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ కోసం వీఎం హోమ్‌కు చెందిన పదెకరాల భూమిని లీజు రూపంలో కేటాయించిన సర్కారు.. తాజాగా లీజు రుసుమును భారీగా తగ్గించింది. ఫలితంగా వీఎం హోమ్ రాబడి పతనం కానుంది. వాస్తవానికి గత నెల 11వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు నెలవారీ లీజు రుసుము రూ. 94,58,167గా నిర్ధారించింది. నెలవారీ లీజును రూ.5,44,500 కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. రాబడిలో రూ.10 కోట్లకు పైగా కోత వీఎం హోమ్ స్థలాల్లో పదెకరాలను రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కేటాయిస్తూ గతనెల 11న ప్రభుత్వం జీవో 48 జారీ చేసింది. ఒక్కో చదరపు గజానికి రూ.35 వేల చొప్పున పదెకరాలకు సంబంధించి 32,428 చదరపు గజాలను పరిగణిస్తూ నెలవారీ లీజు రుసుము రూ.94,58,167గా లెక్క గట్టింది. ప్రభుత్వం కొత్తగా సవరణలు చేస్తూ గతవారం జీవో 50 జారీ చేసింది. నెలవారీ లీజును రూ.5,44,500 గా నిర్ధారించింది. లీజు గడువును 11 ఏళ్లుగా నిర్దేశించింది. మరోవైపు వీఎం హోమ్ భూములను ఇతర ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీజును రద్దు చేయాలని వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. -
మళ్లీ డ్రగ్స్ రాకెట్ కలకలం
నైజీరియన్ సహా ముగ్గురి అరెస్ట్ కెల్విన్, సంగీతతోనూ సంబంధాలు లిస్ట్ లో సినీ సెలబ్రిటీలు! హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ దందా వెలుగు చూసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు 10 లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆరుగురు కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా, నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయిన వారిలో ఓ విదేశీయుడు కూడా ఉండగా, వారి వద్ద నుంచి సుమారు 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గోవా, తెలంగాణలోనూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న గ్యాబ్రియెల్, నవ్యంత్, అకింత్ పాండ్యా, గణత్‌కుమార్ లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరికి డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్‌తోపాటు విజయవాడ డ్రగ్స్ డాన్ సంగీత ముఠాతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి సుమారు 50 మంది మహిళలు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా అందించినట్లు తేలిందని కమిషనర్ తెలిపారు. బంజారాహిల్స్, గచ్చిబౌలిలోని పలు పబ్‌లకు చేరవేస్తున్న వీళ్లు, ఆగష్టు 15న గోవాలో పెద్ద రేవ్ పార్టీనే ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పరీక్షల నిమిత్తం వారి వద్ద నుంచి రక్తం,గోళ్లు, వెంట్రుకలను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు మహేష్ భగవత్ వెల్లడించారు. -
73మంది ఎస్సైలకు స్థానచలనం
హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి, ఎల్బీనగర్, భువనగిరి జోన్లలోని లా అండ్ అర్డర్, ట్రాఫిక్, సీసీఎస్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 73 మంది ఎస్ఐలకు స్థానచలనం కలిగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చాలా కాలం నుంచి ఒకే పోలీసు స్టేషన్లలో పని చేస్తున్నవారే అధికంగా ఉన్నారు. వీరందరినీ వివిధ విభాగాలతో పాటు ఇతర ఠాణాలకు బదిలీ చేశారు. ఇప్పటికే 21 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేసిన మహేష్ భగవత్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్ఐలను బదిలీ చేశారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.