సాక్షి, హైదరాబాద్: మహిళలను వేధించే పోకిరీలకు రాచకొండ పోలీసులు చెక్ పెడుతున్నారు. వారిని పట్టుకోవడం..శిక్షించడంలో ఏమాత్రం ఉపేక్షించడం లేదు. తీవ్రతను బట్టి అప్పటికప్పుడే వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నారు. గత పది వారాలలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 82 కేసులు నమోదు కాగా.. ఇందులో 29 ఎఫ్‌ఐఆర్‌లు, 36 పెట్టీ కేసులు, 17 కౌన్సిలింగ్ కేసులున్నాయి.
ఆయా కేసులలో 106 మంది ఈవ్ టీజర్లను అరెస్టు చేశారు. వీరిలో 65 మంది మేజర్లు, 41 మంది మైనర్లున్నారు. ఆయా పోకిరీలకు శనివారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ ఆఫీసులో రాచకొండ షీ టీమ్స్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సంయుక్తంగా కౌన్సిలింగ్ ఇచ్చారు.
అనధికారిక అనాథాశ్రమాలు..
ముస్కాన్–8 లో భాగంగా రాచకొండ షీ టీమ్స్.. అనధికారిక అనాథ పిల్లల గృహాలను గుర్తించారు. మేడిపల్లి శాంతినగర్‌లోని ఆశ కుటీర్ బాయ్స్ హోమ్, కాకతీయనగర్‌లోని వివేకానంద అనాథాశ్రమం, కాచవానిసింగారంలోని బాలవికాస్ చిల్డ్రన్స్ హోమ్స్, జవహర్‌నగర్ క్రాస్ రోడ్‌లోని విజన్‌ఇండ్ ఫౌండేషన్‌లను గుర్తించి మూసేశారు. అందులోని 50కి పైగా అనాథలను ప్రభుత్వ హోమ్స్‌కు తరలించారు.
అలాగే మెట్రో రైళ్లలో షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళల బోగిలో చొరబడిన 8 మంది పోకిరీలను పట్టుకున్నారు. ఆయా మెట్రో స్టేషన్ మాస్టర్‌కు జరిమానా విధించారు. గత 10 వారాలలో రాచకొండ షీ టీమ్స్ 4 బాల్య వివాహాలను అడ్డుకుంది. కాగా ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులను ఉపేక్షించకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్‌కే సలీమా విజ్ఞప్తి చేశారు.
బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, షాపింగ్ మాళ్లు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు ఎక్కడైనా సరే మహిళలను వేధిస్తే వెంటనే 94906 17111 నంబరులో లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.
(చదవండి: నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..!)
Comments
Please login to add a commentAdd a comment