‘విక్టోరియా’ లీజు భారీగా తగ్గింపు
‘విక్టోరియా’ లీజు భారీగా తగ్గింపు
Published Sat, Sep 2 2017 3:53 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM
- రాచకొండ కమిషనరేట్ భూమి లీజు రుసుములో మార్పులు
- రూ.94 లక్షల నుంచి 5 లక్షలకు నెలవారీ లీజు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: విక్టోరియా మెమోరియల్ హోమ్ ట్రస్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ట్రస్టుకు సంబంధించిన భూములను ఒక్కో విభాగానికి లీజు రూపంలో కేటాయించడంతో హోమ్ ఉనికి గందరగోళంగా మారింది. తాజాగా లీజు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ కోసం వీఎం హోమ్‌కు చెందిన పదెకరాల భూమిని లీజు రూపంలో కేటాయించిన సర్కారు.. తాజాగా లీజు రుసుమును భారీగా తగ్గించింది. ఫలితంగా వీఎం హోమ్ రాబడి పతనం కానుంది. వాస్తవానికి గత నెల 11వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు నెలవారీ లీజు రుసుము రూ. 94,58,167గా నిర్ధారించింది. నెలవారీ లీజును రూ.5,44,500 కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.
రాబడిలో రూ.10 కోట్లకు పైగా కోత
వీఎం హోమ్ స్థలాల్లో పదెకరాలను రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కేటాయిస్తూ గతనెల 11న ప్రభుత్వం జీవో 48 జారీ చేసింది. ఒక్కో చదరపు గజానికి రూ.35 వేల చొప్పున పదెకరాలకు సంబంధించి 32,428 చదరపు గజాలను పరిగణిస్తూ నెలవారీ లీజు రుసుము రూ.94,58,167గా లెక్క గట్టింది. ప్రభుత్వం కొత్తగా సవరణలు చేస్తూ గతవారం జీవో 50 జారీ చేసింది. నెలవారీ లీజును రూ.5,44,500 గా నిర్ధారించింది. లీజు గడువును 11 ఏళ్లుగా నిర్దేశించింది. మరోవైపు వీఎం హోమ్ భూములను ఇతర ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీజును రద్దు చేయాలని వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.
Advertisement