Victoria Memorial Home Trust
-
దేవుడి భూముల్ని లీజుకు ఎలా చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: దేవుడి భూముల్ని లీజుకు ఎలా ఇస్తారని తెలంగాణ సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. విక్టోరియా హోంకు చెందిన భూమి దేవాదాయ శాఖ పేరిట రిజిస్టర్ అయిందని, అందులో పది ఎకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఎలా లీజుకిస్తారని నిలదీసింది. ప్రభుత్వ భూమి మాదిరిగానే దేవుడి భూమిని కూడా తాము లీజుకు ఇవ్వొచ్చని ప్రభుత్వం చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని నిజాం కాలం నాటి విక్టోరియా హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు పది ఎకరాలు లీజుకు ఇవ్వడాన్ని అదే హోంకు చెందిన పూర్వపు విద్యార్థి ఎల్.బుచ్చిరెడ్డి సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం మరోసారి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. -
విక్టోరియా హోం లీజు రికార్డులను ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన భూమిని లీజుకివ్వడానికి సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిచ్చిన భూమి రూపు రేఖలను మార్చొద్దని, భూమిని చదును చేయడం గానీ, ఆ భూమిలో ఉన్న చెట్లను కొట్టేయడం గానీ చేయవద్దంటూ గతవారం ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విక్టోరియా మెమోరియల్‌కు చెందిన పదెకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ విక్టోరియా మెమోరియల్ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్.బుచ్చిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘విక్టోరియా’ లీజు భారీగా తగ్గింపు
- రాచకొండ కమిషనరేట్ భూమి లీజు రుసుములో మార్పులు - రూ.94 లక్షల నుంచి 5 లక్షలకు నెలవారీ లీజు తగ్గింపు సాక్షి, హైదరాబాద్: విక్టోరియా మెమోరియల్ హోమ్ ట్రస్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ట్రస్టుకు సంబంధించిన భూములను ఒక్కో విభాగానికి లీజు రూపంలో కేటాయించడంతో హోమ్ ఉనికి గందరగోళంగా మారింది. తాజాగా లీజు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ కోసం వీఎం హోమ్‌కు చెందిన పదెకరాల భూమిని లీజు రూపంలో కేటాయించిన సర్కారు.. తాజాగా లీజు రుసుమును భారీగా తగ్గించింది. ఫలితంగా వీఎం హోమ్ రాబడి పతనం కానుంది. వాస్తవానికి గత నెల 11వ తేదీన ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు నెలవారీ లీజు రుసుము రూ. 94,58,167గా నిర్ధారించింది. నెలవారీ లీజును రూ.5,44,500 కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. రాబడిలో రూ.10 కోట్లకు పైగా కోత వీఎం హోమ్ స్థలాల్లో పదెకరాలను రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కేటాయిస్తూ గతనెల 11న ప్రభుత్వం జీవో 48 జారీ చేసింది. ఒక్కో చదరపు గజానికి రూ.35 వేల చొప్పున పదెకరాలకు సంబంధించి 32,428 చదరపు గజాలను పరిగణిస్తూ నెలవారీ లీజు రుసుము రూ.94,58,167గా లెక్క గట్టింది. ప్రభుత్వం కొత్తగా సవరణలు చేస్తూ గతవారం జీవో 50 జారీ చేసింది. నెలవారీ లీజును రూ.5,44,500 గా నిర్ధారించింది. లీజు గడువును 11 ఏళ్లుగా నిర్దేశించింది. మరోవైపు వీఎం హోమ్ భూములను ఇతర ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీజును రద్దు చేయాలని వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.