ఎన్నాళ్లీ లిటిగేషన్‌?! | Supreme Court Response On Pending Cases | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ లిటిగేషన్‌?!

Published Thu, May 3 2018 12:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

 Supreme Court Response On Pending Cases - Sakshi

సుప్రీంకోర్టు

ఏళ్లు గడుస్తున్నా న్యాయస్థానాల్లో ఎటూ తెమలని కేసుల తీరుపై ఎవరెంతగా ఆవేదన పడుతున్నా ఫలితం కనిపించని తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి కాస్త కటువుగానే చెప్పింది. ఒకపక్క న్యాయ సంస్కరణలు అవసరమని న్యాయవ్యవస్థను తొందరపెడుతున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యాజ్య విధాన రూపకల్పనలో అంతులేని జాప్యాన్ని ప్రదర్శిస్తున్నదంటూ వ్యాఖ్యానించింది. సమస్యకు కారణాలేమిటో తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లోపమెక్కడ ఉందో నిర్ధారించుకుని దానికి పరిష్కారాన్ని వెదకాలి. కానీ సమస్య తెలుసు...అందుకు కారణమూ తెలుసు. దానికి పరి ష్కారమూ ఖరారైంది. కానీ ఆచరణ దగ్గరకొచ్చేసరికి నిలువెల్లా నిర్లక్ష్యమే. ఏడె నిమిదేళ్లుగా ఈ నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది.  కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఇదే వరస. పెండింగ్‌ కేసులు కొండలా పెరిగిపోవడానికి రెండు ప్రధాన కార ణాలు న్నాయి.

అందులో ఒకటి తగినంతమంది న్యాయమూర్తులు లేక పోవ డమైతే...రెండోది అపరిమితంగా వ్యాజ్యాలు పెరిగిపోవడం. ఈ రెండింటికీ ప రిష్కారం కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తుల్ని నియమించాల్సింది కేంద్రమే. వ్యాజ్యాల నియంత్రణ కూడా దాని చేతుల్లోనే ఉంది. న్యాయస్థానాల్లో పైనుంచి కింది వరకూ ఉండే వ్యాజ్యాలన్నిటిలో ప్రధాన కక్షిదారు పాలక వ్యవస్థే. వాస్తవానికి ఈ వ్యాజ్యాల సంఖ్య ఎంతన్న విషయంలో అధికారిక గణాంకాలు లేవు.  జిల్లా కోర్టులు మొదలు సుప్రీంకోర్టు వరకూ 3.14 కోట్ల కేసులుంటే...ఇందులో 46 శాతం కేసుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షిదారులుగా ఉన్నాయని అంచనా. ‘మనిషికి నూరేళ్లు...వ్యాజ్యానికి వెయ్యేళ్లు’ అన్న నానుడి గాల్లోంచి ఊడిపడలేదు. దశాబ్దాలు గడుస్తున్నా కేసులు తేలక నీరసించినవారి మస్తిష్కంలోనే ఇది పుట్టింది.

నిజానికి సుప్రీంకోర్టు 1970 మొదలుకొని ఈ విషయంపైనే తరచుగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. కేసుల్ని యథాలాపంగా, యాంత్రికంగా నడపడం కాక, వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉందో లేదో సమీక్షించుకోవాలని చెబుతూనే ఉంది. కానీ పాలకులకు వినే తీరిక లేదు. జస్టిస్‌ డీఏ దేశాయ్‌ నేతృత్వంలోని లా కమిషన్‌ 1988లో ఈ సమస్యను లోతుగా సమీక్షించింది. ఇలా నిరవధికంగా వ్యాజ్యాల్ని కొనసాగిస్తూ పోవడం వల్ల  ప్రజాధనం వృధా కావడమే కాక, పెండింగ్‌ కేసులు పెరుగుతాయని, నిజమైన బాధితులకు న్యాయం కలగజేయడం న్యాయవ్యవస్థకు అసాధ్యమవుతుందని ఆ నివేదిక హెచ్చరించింది.  కానీ ఆనాటి ప్రభుత్వంగానీ, అనంతర ప్రభుత్వాలుగానీ నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. తొలిసారి 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఆ మరుసటి ఏడాదికల్లా జాతీయ వ్యాజ్య విధానం(ఎన్‌ఎల్‌పీ) పేరుతో ఒక ముసాయిదాను కూడా రూపొందించింది.

ప్రభుత్వాన్ని ఒక బాధ్యతాయుతమైన, సమర్ధవంతమైన కక్షిదారుగా రూపు దిద్దడమే ధ్యేయమని ప్రకటించింది. కానీ విషాదమేమంటే అందులో సమస్యను ఏకరువు పెట్టడం... దాని పూర్వాపరాలను వివరించడం తప్ప పరిష్కారానికి అవసరమైన సూచనల్లేవు. ప్రభుత్వ వ్యాజ్యాల విషయంలో ‘మరింత జవాబుదారీతనం’ ఉండాలని, దాన్ని ఉల్లంఘించిన అధికారులపై ‘తగిన చర్య’ తీసుకోవాలని చెప్పడమైతే చెప్పింది. అందుకోసం జాతీయస్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ‘సాధికార కమిటీలు’ ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ వాటి స్వరూప స్వభావాలు, విధివిధానాలేమిటో చెప్పలేదు. జవాబుదారీతనం ప్రదర్శించని అధికారులపై తీసుకోవాల్సిన చర్యలేమిటో కూడా వివరించలేదు. 

విధానాలు పటిష్టంగా, పకడ్బందీగా ఉంటే...అందుకవసరమైన పర్యవేక్షణ యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తే వ్యాజ్యాల శాతం గణనీయంగా తగ్గుతుంది. కావల్సిందల్లా పాలకుల్లో సంకల్పం. అది లోపించిన కారణంగానే ఇప్పటికి ఎనిమిదేళ్లవుతున్నా దిక్కూ మొక్కూ లేదు. మూడేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమస్యపై దృష్టి సారించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యతాయుతమైన, సమర్ధవంతమైన కక్షిదారులుగా ఉండాలని సూచించారు. దాంతో ఇక దిద్దుబాటు చర్యలు మొదలవుతాయని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్టే నిరుడు జూన్‌లో మరో ఎన్‌ఎల్‌పీ ఖరారైంది. మళ్లీ ఆ తర్వాత ఏమొచ్చిందో అది అక్కడితో ఆగిపోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రధాని కార్యాలయం, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ  పనికిమాలిన కేసుల కూపీ లాగి, వాటికి ముగింపు పలకమని వివిధ ప్రభుత్వ విభాగాలను అడుగుతూనే ఉన్నాయి.

నిరుడు జూన్‌నాటికి  కేంద్రంలోని వివిధ విభాగాలు మొత్తం 1,40,000 వ్యాజ్యాలు నడుపుతున్నాయని తేల్చారు. అందులో సగం రైల్వే శాఖవే. కేంద్ర ఆర్థిక శాఖ, కమ్యూనికేషన్లు, హోం, రక్షణ శాఖలు తర్వాతి స్థానాల్లోకొస్తాయి. చిత్రమేమంటే ఈ విభాగాలు తామంతా ప్రభుత్వంలో భాగమన్న సంగతి మరిచి ఒకదానిపై ఒకటి వ్యాజ్యం దాఖలు చేసుకుంటాయి. సమస్య తలెత్తిన రెండు విభాగాల కార్యదర్శులు కూర్చుని చర్చించుకుంటే అది పరిష్కారం కావడం తేలిక. ఆ స్థాయిలో తేలకపోతే ఆయా శాఖల మంత్రులు వారికి తగిన సూచనలిస్తే సరిపోతుంది. కానీ దేన్నయినా న్యాయస్థానమే తేల్చాలన్న ధోరణి ప్రభుత్వ విభాగాల్లో ఊడలు దిగడంతో సమస్య రాను రాను జటిలమవుతోంది. కొన్ని సందర్భాల్లో వాజ్యాలు పున రావృ తమ వుతున్నాయి.

ఉదాహరణకు నిరుడు డిసెంబర్‌లో కేంద్రం దాఖలు చేసిన కొన్ని అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్లీ అదే అంశంపై మొన్న మార్చిలో రెండోసారి వ్యాజ్యాలు దాఖలు చేసింది. దాంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ గట్టిగా హెచ్చరించింది. ఈ అయోమయాన్ని ప్రభుత్వాలు వదుల్చుకోవాలి. సమగ్రమైన సర్వే జరిపి కేసుల సంఖ్య ఎంతో తేల్చాలి. వాటిని  శాస్త్రీయంగా వర్గీకరించుకుని అవసరమైనవేవో, కానివేవో తేల్చాలి. వృథా కేసులకు స్వస్తి పలికి, న్యాయ వ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గించాలి. పౌరులకు సత్వర న్యాయం లభించేందుకు దోహదపడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement