కేసులన్నీ ఆన్‌లైన్..
సాక్షి, గుంటూరు: పోలీస్‌శాఖలో పెండింగ్ కేసుల ఆన్‌లైన్‌కు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా ఏ పోలీస్‌స్టే షన్‌లో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, పురోగతి ఏమిటని పోలీస్ ఉన్నతాధికారులు తెలుసుకోవాలంటే క్రైమ్ మీటింగ్‌లో, లేదా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి తెలుసుకోవాల్సి ఉండేది.
ప్రస్తుతం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్) ద్వారా రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన కేసు వివరాలైన ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) పనితీరు ఎప్పటికప్పుడు అటు డీజీపీ కార్యాలయం, ఇటు జిల్లా పోలీస్ అధికారి కార్యాలయాల నుంచి తెలుసుకునే వీలుంటుంది. ఇంకా పలు ఉపయోగాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెపుతున్నారు.
గతంలో అనేక పోలీస్‌స్టేషన్‌లలో ముఖ్యమైన కేసులకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. ఇంటి దొంగలే నేరస్తులతో చేతులు కలిపి వారిని కేసుల నుంచి తప్పించేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఇలాంటి చర్యల వల్ల పోలీస్ శాఖ అప్రతిష్ట పాలవుతోందని గ్రహించిన ఉన్నతాధికారులు అన్ని పోలీస్ స్టేషన్‌లలోని క్రైమ్ రికార్డులను ఆన్‌లైన్‌లో ఉంచటం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తేల్చారు.
సంచలనాత్మక కేసుల వివరాలు, వాటి పురోగతిపై పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక వేళ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు మాయమైనా వెంటనే ఆన్‌లైన్ ద్వారా స్కాన్‌చేసి తిరిగి రికార్డు తయారు చేసుకోవచ్చు. అంతేకాక, ఈ విధానం ద్వారా అవినీతి అధికారుల ఆట కట్టించవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
కేసు నమోదు చేసిన అధికారి ఉన్నా లేకపోయినా ఆ స్థానంలో వచ్చిన కొత్త అధికారి ఆన్‌లైన్‌లో చూసుకుని సులువుగా అర్థం చేసుకునే వీలుంటుంది.
ఒక కేసులో నిందితుడిని అరెస్ట్ దగ్గర నుంచి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది.
టీసీఎస్ ద్వారా ఆన్‌లైన్ ...
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలోని క్రైమ్ రికార్డులను ఆన్‌లైన్‌కు అనుసంధాన చేసే బాధ్యతను ప్రభుత్వం టీసీఎస్ సంస్థకు అప్పగించింది.
ప్రతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయా పోలీస్‌స్టేషన్‌ల నుంచి తీసుకు వచ్చిన క్రైమ్ రికార్డులను ఆన్‌లైన్ చేస్తున్నారు.
2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ప్రతి రికార్డును ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. ఆయా పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించిన ఎస్‌ఐలు అక్కడే ఉండి టీసీఎస్ సిబ్బందికి సహకారిస్తున్నారు.
ఒక్కో పోలీస్ స్టేషన్ రికార్డులను ఆన్‌లైన్ చేసేందుకు సుమారు 15 రోజులు పడుతోంది. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల రికార్డులు ఆన్‌లైన్ చేయాలంటే మరి కొన్ని నెలలు పడుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
ఇవన్నీ పూర్తయిన తరువాత ప్రతి పోలీస్ స్టేషన్‌లో నిత్యం నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకుంటారు.