Crime and Criminal Tracking Network System
-
పాపిలాన్ పట్టేస్తోంది!
ఓ యువకుడు గతంలోని తన నేర చరితను దాచి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ‘పాపిలాన్’సాంకేతికత అతడి పాపాల చిట్టా గుట్టువిప్పింది. సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేలిముద్రలు పరీక్షించగా.. ఓ వ్యక్తిని చంపేందుకు తిరుగుతున్న పాత నేరస్తుడిగా గుర్తించారు. – సాక్షి, హైదరాబాద్ తెలంగాణ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ) లోని ఫింగర్‌ప్రింట్ విభాగం (ఎఫ్‌పీబీ) సమకూర్చుకున్న ‘పాపిలాన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’నేరగాళ్ల గుర్తింపు ప్రక్రియలో అద్భుత ఫలితాలిస్తోంది. 2017లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పాపిలాన్–ఏఎఫ్ఐఎస్ (ఆటోమేటె డ్ ఫింగర్ అండ్ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్ట మ్) ప్రపంచస్థాయి సాంకేతికత రాష్ట్ర పోలీసులకు నేర దర్యాప్తులో కీలకంగా మారింది. అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్ మాత్రమే వినియోగించే ఈ టెక్నాలజీ మన పోలీసులు వినియోగిస్తుండటంతో నేరదర్యాప్తులో అద్భుత పురోగతి కన్పిస్తోంది. ఏంటి ఈ సాంకేతికత? పాపిలాన్ అంటే ఫ్రెంచ్ భాషలో సీతాకోకచిలుక అని అర్థం. రష్యాకు చెందిన పాపిలాన్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. బయోమెట్రిక్ వ్యవస్థలో పాపిలాన్ నెక్ట్స్ జెనరేషన్ సాం కేతికత అని చెప్పొచ్చు. వేలిముద్రలు, అర చేతి ముద్రల ఎలక్ట్రానిక్ డేటాబేస్‌ను రూపొందించడం, నిక్షిప్తం చేయడం, వెతికిపెడుతుం ది పాపిలాన్. నేర పరిశోధనకు కచ్చితమైన సమాచారాన్ని క్షణాల్లో∙క్రోడీకరించి ఇస్తుంది. దొంగతనాలు, దోపిడీలు జరిగిన స్థలాల్లో సేకరించిన వేలిముద్రలను విశ్లేషించి అది ఎవరు చేశారో గుర్తించి క్షణాల్లో పోలీసులకు చెప్పేస్తుంది. ఇందులో పేపర్ మీద లైవ్ స్కానర్స్ సాయంతో వేలిముద్రలను సేకరిస్తారు. భారత్‌లో ఇలాంటి సాంకేతికత కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణే కావడం గమనార్హం. ‘మొబైల్ సెక్యూరిటీ చెక్ సిస్టమ్’ను కూడా కలిగి ఉంది. అనుమానితుల నేరచరిత్ర మొత్తం 5 నుంచి 10 సెకన్లలో అధికారి ట్యాబ్లెట్ పీసీ మీద ప్రత్యక్షమవుతుంది. సాధించిన విజయాలు.. ►మొత్తం 1,345 దొంగతనాలు, దోపిడీలు లాంటి కేసుల్లో నేరస్తులను గుర్తించి వారి నుంచి రూ.19.49 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. వీటిలో 700 పాత కేసులు. ►72 కేసుల్లో గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో దోహదపడింది. ►మొబైల్ సెక్యూరిటీ సిస్టమ్ చెక్ ద్వారా అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తున్న 8,850 మంది నేరచరితులను గుర్తించింది. ►నేరచరిత్రను దాచి కొత్త పాస్‌పోర్టు పొం దాలనుకున్న 60 మందిని గుర్తించింది. ►పేరు, చిరునామా మార్చుకుని తిరుగు తు న్న 49 మంది నేరగాళ్లను గుర్తించింది. ►మన రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలను సైతం విశ్లేషించి, 20 మంది నేరస్తులను గుర్తించి ఆయా రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ►2014 వరకు ఉమ్మడి ఏపీకి సంబంధించి ఫింగర్ ప్రింట్ బ్యూరో వివరాలన్నీ ఈ టెక్నాలజీకి అనుసంధానించారు. ►క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్ తో తన టెక్నాలజీని తొలిసారి అనుసంధానించింది పాపిలాన్ కావడం విశేషం. -
కేసులన్నీ ఆన్లైన్..
సాక్షి, గుంటూరు: పోలీస్‌శాఖలో పెండింగ్ కేసుల ఆన్‌లైన్‌కు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా ఏ పోలీస్‌స్టే షన్లో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, పురోగతి ఏమిటని పోలీస్ ఉన్నతాధికారులు తెలుసుకోవాలంటే క్రైమ్ మీటింగ్‌లో, లేదా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి తెలుసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) ద్వారా రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన కేసు వివరాలైన ఆన్లైన్లో తెలుసుకునేలా అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పనితీరు ఎప్పటికప్పుడు అటు డీజీపీ కార్యాలయం, ఇటు జిల్లా పోలీస్ అధికారి కార్యాలయాల నుంచి తెలుసుకునే వీలుంటుంది. ఇంకా పలు ఉపయోగాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెపుతున్నారు. గతంలో అనేక పోలీస్స్టేషన్లలో ముఖ్యమైన కేసులకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. ఇంటి దొంగలే నేరస్తులతో చేతులు కలిపి వారిని కేసుల నుంచి తప్పించేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలూ వచ్చాయి. ఇలాంటి చర్యల వల్ల పోలీస్ శాఖ అప్రతిష్ట పాలవుతోందని గ్రహించిన ఉన్నతాధికారులు అన్ని పోలీస్ స్టేషన్లలోని క్రైమ్ రికార్డులను ఆన్లైన్లో ఉంచటం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తేల్చారు. సంచలనాత్మక కేసుల వివరాలు, వాటి పురోగతిపై పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వేళ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు మాయమైనా వెంటనే ఆన్లైన్ ద్వారా స్కాన్‌చేసి తిరిగి రికార్డు తయారు చేసుకోవచ్చు. అంతేకాక, ఈ విధానం ద్వారా అవినీతి అధికారుల ఆట కట్టించవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన అధికారి ఉన్నా లేకపోయినా ఆ స్థానంలో వచ్చిన కొత్త అధికారి ఆన్లైన్లో చూసుకుని సులువుగా అర్థం చేసుకునే వీలుంటుంది. ఒక కేసులో నిందితుడిని అరెస్ట్ దగ్గర నుంచి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. టీసీఎస్ ద్వారా ఆన్లైన్ ... క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలోని క్రైమ్ రికార్డులను ఆన్‌లైన్‌కు అనుసంధాన చేసే బాధ్యతను ప్రభుత్వం టీసీఎస్ సంస్థకు అప్పగించింది. ప్రతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయా పోలీస్స్టేషన్ల నుంచి తీసుకు వచ్చిన క్రైమ్ రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ప్రతి రికార్డును ఆన్లైన్లో ఉంచుతున్నారు. ఆయా పోలీస్స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు అక్కడే ఉండి టీసీఎస్ సిబ్బందికి సహకారిస్తున్నారు. ఒక్కో పోలీస్ స్టేషన్ రికార్డులను ఆన్లైన్ చేసేందుకు సుమారు 15 రోజులు పడుతోంది. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల రికార్డులు ఆన్లైన్ చేయాలంటే మరి కొన్ని నెలలు పడుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత ప్రతి పోలీస్ స్టేషన్లో నిత్యం నమోదయ్యే ఎఫ్ఐఆర్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచేలా చర్యలు తీసుకుంటారు.