
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రాల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపడుతున్న సైన్యంపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో త్రాల్ సెక్టార్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.