సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు
గట్టిగా తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్
పాక్ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసం..
జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ బలగాల ఆగడాలు శ్రుతిమించాయి. జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు దాడులకు తెగబడ్డారు. అర్నియా, ఆర్‌ఎస్ పురా ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల నుంచి 15 భారత ఆర్మీ ఔట్‌పోస్టులతోపాటు పలు గ్రామాలపై కాల్పులు జరిపి మోర్టారు బాంబులు పేల్చారు. బీఎస్‌ఎఫ్ జవాన్లు ఈ దాడులను బలంగా తిప్పికొట్టారు. ఆదివారం ఉదయం వరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి. పాక్ దాడుల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని పశువులూ చనిపోయాయి. పలు గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాక్ జవాన్లు ఇటీవల భారీస్థాయిలో కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదే తొలిసారి.
కాల్పుల విరమణకు గండికొట్టడం గత నాలుగు రోజుల్లో ఐదోసారి. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఆ దేశంతో మాట్లాడాలని కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. జమ్మూ సరిహద్దులో చొరబాట్లను నియంత్రించడానికి ప్రభుత్వం మరో రెండు వేల మంది బీఎస్‌ఎఫ్ జవాన్లను మోహరించింది. ఇదిలా ఉండగా, అస్సాంలోని దోల్దోలీ అభయారణ్యంలో ఆదివారం అనుమానిత తీవ్రవాదులు నాగాలాండ్ వైపు నుంచి భద్రతా బలగాలపై భారీస్థాయిలో కాల్పులు జరిపారు. ఒక పోలీసు మృతిచెందగా, ఒక ఫారెస్ట్ గార్డు, కార్మికుడు గాయపడ్డారు. పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు సాగాయి.