భారత్-పాక్ సరిహద్దు (ఫైల్ పిక్)
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా అధీనరేఖ వద్ద కొన్నాళ్లుగా మళ్లీ ఉద్రి క్తతలు పెరుగుతున్నాయి. అధీన రేఖ నిశ్శబ్ద రేఖగా ఎప్పుడూ లేదు. కానీ రెండు నెలలుగా అక్కడ చోటు చేసుకున్న ఉదంతాలు గమనిస్తే గత పదిహేనేళ్లలో ఇంత చేటు ఘర్షణలు ఎప్పుడూ లేవని అర్ధమవుతుంది. ఆదివారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత కెప్టెన్‌తోసహా నలుగురు జవాన్లు కన్నుమూశారు. అయిదురోజుల్లో ఇలా చనిపోయిన జవాన్ల సంఖ్య 9కి చేరుకుంది. ఇరువైపులా సైని కులతోపాటు సాధారణ పౌరులు కూడా ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎందరో క్షతగాత్రులవుతున్నారు.
అధీనరేఖకు, అంతర్జాతీయ సరిహద్దుకు చేర్చి ఉన్న గ్రామాల్లోని ఇళ్లు నిలువునా తూట్లు పడి కనబడుతున్నాయి. సాధారణ పౌరులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న కాల్పుల కారణంగా అటు అధీన రేఖ వద్ద, ఇటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద గత నవంబర్ నుంచి 500 పాఠ శాలలు మూసేయవలసి వచ్చింది. గత సంవత్సరం అధీన రేఖ వద్ద పాకిస్తాన్ వైపు నుంచి 881 కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకోగా ఒక్క డిసెంబర్‌లోనే అవి 147 ఉన్నాయి. మొన్న జనవరి 1 నుంచి ఇంతవరకూ దాదాపు 240 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలో ఈ ఉదంతాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య గత ఏడాది ఉదంతా లన్నిటా మరణించినవారి సంఖ్యతో సమానంగా ఉన్నదంటున్నారు. చాలా సంద ర్భాల్లో మన సైన్యం గట్టి జవాబిచ్చింది. పర్యవసానంగా అటువైపు కూడా ప్రాణ నష్టం ఉంటున్నది. తొలుత మీరు కాల్పులు జరిపారంటే మీరు జరిపారని పర స్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా సర్వసాధారణమైంది.
ఇలాంటి ఉల్లంఘనలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవడానికి ఇరు దేశాల సైనిక డైరెక్టర్ జనరళ్ల(డీజీఎంఓ) మధ్యా హాట్‌లైన్ సదుపాయం ఉంది. ఈమధ్య కాలంలో ఒకటి రెండుసార్లు అలా మాట్లా డుకున్నారని అంటున్నారు. కానీ ఫలితం లేదు. 2016 సెప్టెంబర్‌లో మన సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడ చొరబాటుదార్ల కోసం నిర్మించిన శిబిరాలను ధ్వంసం చేసింది. అంతక్రితం ఉడీ సెక్టార్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేసి బిహార్ బెటాలియన్‌కు చెందిన 19మంది జవాన్ల ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా ఈ సర్జికల్ దాడులు జరిగాయి. అయితే అవి సైతం పాకిస్తాన్‌ను కట్టడి చేయలేకపోయాయని ఆ తర్వాత సాగుతున్న ఘర్షణల పరంపరను గమనిస్తే అర్ధమవుతుంది. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అయితే ఉల్లంఘనల సంఖ్య మొదట్లో చాలా స్వల్పంగా ఉండేది. కానీ 2013 దాటాక ఈ ఉదంతాలు క్రమేపీ పెరుగుతూ 2015 నాటికి మితిమీరాయి. వాటితోపాటే మరణాల సంఖ్య పెరు గుతోంది. ఇదంతా చొరబాటుదార్ల సమస్యతో మొదలవుతున్నదని మన నిపుణులు చెబుతున్నారు. లష్కరే తొయిబా, ఇతర సంస్థలకు చెందిన మిలిటెంట్లకు పాక్ సైన్యం మారణాయుధాలిచ్చి భారత్ గడ్డపై ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తూ అందులో భాగంగానే కాల్పులు జరుపుతున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉడీ సెక్టార్‌లో మన సైన్యానికి భారీ నష్టం కలగజేసిన లష్కరే మిలిటెంట్లు అలా ప్రవే శించినవారే. ఇరు దేశాల మధ్యా రెండుసార్లు పూర్తి స్థాయి యుద్ధాలు చోటు చేసుకున్నాయి. 1999లో కార్గిల్‌లో చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని మన జవాన్లు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా దాదాపు మూడు నెలలు చిన్నపాటి యుద్ధం జరిగింది.
యుద్ధ సమయాల్లో ప్రభుత్వం ముందుగానే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తుంది. అక్కడ జవాన్ల కదలికలు ముమ్మరమవుతాయి. యుద్ధం ముగిసిందన్న ప్రకటన వచ్చేవరకూ ఊరు వెళ్లడం క్షేమం కాదని అందరికీ తెలుస్తుంది. కానీ అధీనరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలది ఏడాది పొడవునా అయోమయ స్థితి. ఈ క్షణం అంతా సవ్యంగానే ఉన్నదని పిస్తుంది. మరుక్షణంలో సరిహద్దుల ఆవలి నుంచి శతఘ్నులు, మోర్టార్లు గర్జిస్తాయి. అవి ఎప్పుడు శాంతిస్తాయో తెలియదు. పొలం పనికెళ్లినవారో, బడి నుంచి తిరిగొస్తున్న పిల్లలో, ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళో వాటి బారిన పడతారు. ప్రాణాలైనా పోవచ్చు. తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యమూ రావొచ్చు. చావు బతుకుల మధ్య ఉండే సన్నటి సరిహద్దు రేఖ అక్కడ చెదిరిపోతుంది. చిత్రమేమంటే ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనలూ, వాటిననుసరించి ఉండే పరస్పర హెచ్చ రికలు, వాటికి కొనసాగింపుగా ఆరోపణల యుద్ధం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉన్నా రెండు దేశాల మధ్యా వాణిజ్య లావాదేవీలు ఆగవు. అలా ఆపి రోజూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నష్టపోవడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉండవు. అయితే ఇరు దేశాల మధ్యా సామరస్య వాతావరణం ఏర్పడితే ఈ వాణిజ్యం మరిన్ని వందల రెట్లు పెరుగుతుందని, అది రెండు ఆర్థిక వ్యవస్థలనూ బలోపేతం చేస్తుందని పాకిస్తాన్ సైన్యం గుర్తించదు.
రెండు దేశాల డీజీఎంఓల మధ్యా హాట్‌లైన్ సదుపాయం ఉన్నమాట నిజమే అయినా ఆచరణలో అది పెద్దగా ఉపయోగపడటం లేదు. సమస్యకు మూలంగానీ, దానికి పరిష్కారంగానీ అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. ఇరు దేశాల మధ్యా ఉన్నత స్థాయి చర్చలు జరగడం, అంతర్జాతీయ వేదికల ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిళ్లు తీసుకురావడం ముఖ్యం. అలాగే కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొనడానికి రాజకీయ పరమైన చర్యలు కూడా ప్రారంభించాలి. అక్కడ ప్రశాంతత నెలకొంటే సరిహద్దుల్లో పాక్ ఆటలు సాగవు. ఇప్పుడు అధీనరేఖ వద్ద దాదాపు యుద్ధ వాతావరణం నెల కొంది. దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడమన్నది తన చేతుల్లోనే ఉన్నదని పాక్ నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
Comments
Please login to add a commentAdd a comment