Radcliffe Line: అది మహా విషాదపు విభజన రేఖ | Independence Day 2022: Cyril Radcliffe The Man Who Divided India and Pakistan | Sakshi

Radcliffe Line: అది మహా విషాదపు విభజన రేఖ

Published Fri, Aug 12 2022 2:28 PM | Last Updated on Fri, Aug 12 2022 2:28 PM

Independence Day 2022: Cyril Radcliffe The Man Who Divided India and Pakistan - Sakshi

బ్రిటిష్‌ పార్లమెంట్‌ ప్రకటించిన పథకం ప్రకారం భారత్‌ స్వాతంత్య్ర ప్రక్రియకు 1948 జూన్‌ మాసం వరకూ సమయం ఉంది. కానీ అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ అంతవరకూ ఆగకుండా హడావిడిగా ఆ ప్రక్రియను ముగించేశాడు. ఈ తొందరపాటు చర్యే అనేక సమస్యలకు కారణమయింది. భారత ఉపఖండ విభజన కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సీరిల్‌ జాన్‌ ర్యాడ్‌ క్లిఫ్‌ను చైర్మన్‌గా నియమించాడు వైస్రాయ్‌. 1947 జూలై 17న ఢిల్లీ చేరుకున్న ర్యాడ్‌ క్లిఫ్‌కు భారత భూగోళం గురించి, భారతీయుల సంస్కృతి, నాగరికత, ఆచారాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, కొద్దిపాటి క్రైస్తవ జనాభా నివసించే కొన్ని ప్రాంతాలను మరో దేశంగా విడదీయటం చాలా క్లిష్టమైన పని. అయినా పశ్చిమ, తూర్పు సరిహద్దులతో ఐదు వారాల్లోగా ముస్లింల కోసం కొత్త దేశాన్ని (పాకిస్థాన్‌) ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించాడు వైస్రాయ్‌.

సరిహద్దు రేఖను నిర్ణయించడానికి భారత భూగోళం మ్యాపు తీసుకుని విభజన ప్రక్రియ మొదలెట్టారు కమిటీ సభ్యులు. ఒకరోజు  పశ్చిమ సరిహద్దు పంజాబ్‌ ప్రాంతం, మరోరోజు తూర్పు సరిహద్దు బెంగాల్‌ ప్రాంతంలోని ముస్లిం ఇలాఖాలను విమానం నుండి విహంగ వీక్షణం చేసింది కమిటీ. ఇంతలో బ్రిటిష్‌ పార్లమెంట్‌ భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే బిల్లును ఆమోదించిందన్న వార్త సుడిగాలిలా భారత్‌కు చేరింది. అంతే, తూర్పు నుండి పశ్చిమానికి ముస్లింలు; పశ్చిమం నుండి తూర్పుకు హిందువులు, సిక్కులు వలస పోవడం ప్రారంభించారు. మత విద్వేషాలు భగ్గుమన్నాయి.  

ఒకవైపు పరిస్థితులు చేజారుతుంటే... మరోవైపు పోలీసు, పరిపాలనా శాఖలకు సంబంధించిన బ్రిటిష్‌ ఉన్నతాధికారులు ఒక్కరొక్కరుగా లండన్‌ వెళ్ళిపోసాగారు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించి ఆంగ్లేయులు వెళ్ళిపోనున్నట్లు లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ రేడియో ప్రకటన కూడా చేశారు. పరిస్థితులు గమనించిన ర్యాడ్‌ క్లిఫ్‌ 1947 ఆగష్టు 11న త్వరత్వరగా బౌండరీ కమిషన్‌ రిపోర్టు పూర్తి చేసి మరుసటి రోజు లండన్‌ తిరిగి వెళ్ళిపోయాడు. ఆగస్టు 17న ర్యాడ్‌ క్లిఫ్‌ బోర్డర్‌ కమిషన్‌ అవార్డ్‌ వివరాలు ప్రజలకు బహిర్గత మయ్యాయి. వలసపోతున్న ప్రజలపై దాడులు జరిగి పది లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు.

ప్రఖ్యాత జర్నలిస్టు కులదీప్‌ నయర్‌ జరిపిన ఇంటర్వ్యూలో ర్యాడ్‌ క్లిఫ్‌ కొన్ని వాస్తవాలను ప్రస్తావిస్తూ, ‘...4096 కి.మీ. పశ్చిమ భాగం, 3323 కి. మీ. తూర్పు భాగంతో భారత ఉపఖండాన్ని ఐదు వారాల్లో విభజించడం అసంభవమే. కానీ వైస్రాయ్‌ డిక్కీ (మౌంట్‌ బాటెన్‌) ఆదేశంతో నాకు గత్యంతరం లేకపోయింది అప్పుడు’ అని చెప్పాడు. ‘ర్యాడ్‌ క్లిఫ్‌ సర్‌! 15 ఆగస్టులోగా మీరు కేవలం సరిహద్దు గీత గీసి ఇవ్వండి, చాలు మాకు’ అని నెహ్రూ, పటేల్, జిన్నా, ఒకే మాట చెప్పారు. ఆవిధంగా, నేను గీసి ఇచ్చిన బౌండరీ లైన్‌ మ్యాపు, బౌండరీ కమిషన్‌ అవార్డుగా పరిగణించి, తనకు తానుగా వైస్రాయ్‌ మౌంట్‌ బాటెన్‌ కొన్ని మార్పులు చేర్పులు చేసి అధికారికంగా వెల్లడి చేశాడు’ అని తేల్చేశాడు. పశ్చిమ ప్రాంతంలో పెద్ద నగరం ఏదీ లేదని ర్యాడ్‌ క్లిఫ్‌ ఆఖరు క్షణంలో లాహోర్‌ నగరాన్ని భారత్‌ నుండి వేరు చేశాడు. అటు వైపు కలిపిన గురుదాస్‌ పూర్‌ జిల్లాను మళ్ళీ భారత్‌లోకి చేర్చాడు. అమృత్‌సర్‌లోని పలు తెహసీళ్లు, గ్రామాలను తిరిగి పాక్‌లో కలిపాడు. ఆజాదీకా అమృత మహోత్సవం సందర్భంగా, 75 ఏళ్ల క్రితం సరిహద్దు ప్రాంతాల్లో అసువులు బాసిన అమాయక ప్రజలను ఒక్కసారి స్మరించుకోవడం ఎంతైనా అవసరం. (క్లిక్: మేము ఈ దేశ పౌరులమేనా?)


- జిల్లా గోవర్ధన్‌ 
విశ్రాంత ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement