సాక్షి, హైదరాబాద్: ‘జమిలి’ఎన్నికల అంశం రాష్ట్ర బీజేపీలో మరింత జోష్ నింపుతోంది. అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీజేపీకి లాభమని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నెల 18న మొదలుకాబోయే పార్లమెంటు సమావేశాల్లో జరిగే చర్చలు, ప్రకటించే అంశాలతో దేశంలో రాజకీయాలు, ఎన్నికల ఎజెండా మారిపోతాయని.. పరిస్థితి పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోతుందని అంటున్నారు.
కొంతకాలంగా ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. తాజాగా దీనిపై కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది.
ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘జమిలి’తోపాటు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్–యూసీసీ), ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. ఇవన్నీ బీజేపీకి రాజకీయంగా అనుకూలత పెంచుతాయని భావిస్తున్నారు.
ఆలస్యంగా జరిగితే ఎంతో మేలు!
నిర్ణీత గడువు కంటే మూడు, నాలుగునెలలు ఆలస్యమవడంతోపాటు లోక్‌సభతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీకి తిరుగు ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ వరకు ఎన్నికలు ఆగితే.. ఆలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు, ఇతర అంశాలతో పార్టీ కేడర్‌లో ఏర్పడిన సందిగ్థత తొలగిపోతుందని అంటున్నారు. పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు వీలవుతుందని పేర్కొంటున్నారు.
అభ్యర్థులపై కసరత్తు
రాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని గోవా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలకు రాష్ట్రంలోని మూడేసి ఎంపీ స్థానాలకు ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు. ఆయా చోట్ల పార్టీ బలాబలాలు, సత్తా ఉన్న, క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను గుర్తించడంలో మునిగిపోయారు. మరోవైపు అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకూ బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్
బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
గతంలో నిర్ణయించినట్టుగా ఈ నెల 7న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టకుండా.. ఉమ్మడి జిల్లాల వారీగానే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక.. పది ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ కోర్ కమిటీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనితోపాటు సెపె్టంబర్ 17న చేపట్టాల్సిన కార్యక్రమాలు, బస్సుయాత్రలపై సమీక్షించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment