ఢిల్లీ/విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో ఇప్పటికే ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించింది కూడా. మరిన్ని పర్యటనలు.. సంప్రదింపుల తర్వాతే షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అయితే.. దేశ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగానే.. తొలి దశలోనే ఏపీ ఎన్నికలను ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు, అలాగే తమిళనాడు లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
జనవరి 7వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కసరత్తులు మొదలుపెట్టనుంది. ముందుగా తమిళనాడు నుంచే తమ పర్యటనను ప్రారంభించనుంది. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకు.. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉన్న 175 స్థానాలతో పాటు 25 లోక్‌సభ సీట్లకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటోంది కేంద్ర ఎన్నికల సంఘం.
గత ఎన్నికల సమయంలో.. అంటే 2019 ఎన్నికల సమయంలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమై.. మే 19వ తేదీతో లోక్‌సభ/ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో 2024 ఎన్నికలను కూడా ఆరు లేదంటే ఏడు విడతల్లో నిర్వహించాలని ఈసీ అనుకుంటోంది.
ఏపీకి వస్తున్న ఎన్నికల సంఘం
ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితాలోని లోపాలు, అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా వీరు భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఈసీ నుంచి అందాయి.
Comments
Please login to add a commentAdd a comment