ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో దృశ్యం
జమ్మూ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు.
గర్భాలయానికి వెలుపల గేట్ నెంబర్ 3 వద్ద శనివారం ఉదయం 2.30– 2.45 ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఆరంభమైంది. ఒక్కమారుగా జరిగిన ఈ ఘటనతో భీతావహ వాతావరణం నెలకొందని, ఊపిరి ఆడక పలువురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు యూపీ, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా హరియాణా, కశ్మీర్ నుంచి ఒక్కొక్కరున్నారు. గాయపడినవారికి మాతా వైష్ణోదేవి నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు డిశ్చార్జయ్యారు.
ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని, వారంలో నివేదిక ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఆదేశించారు. తొక్కిసలాట అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. దుర్ఘటన జరిగిన గంటకు తిరిగి దర్శనాలకు అనుమతించారు. అయితే పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించకుండా వెనుదిరిగారు.
ప్రముఖుల సంతాపం
దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై రాష్ట్ర యంత్రాంగంతో సంప్రదిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వెలిబుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. మరణించినవారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆలయ బోర్డు చెల్లిస్తుంది.
మరణించినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రధాని జాతీయ ఉపశమన నిధి నుంచి ఈ మొత్తాలందిస్తారు. పర్వదినాల్లో దేవాలయానికి రద్దీ పెరుగుతుందని, నూతన సంవత్సరాదిన యువత రద్దీ పెరగడం తాజా ట్రెండ్‌గా మారిందని, అందువల్ల ఇకమీదట న్యూఇయర్ రోజున తగిన ఏర్పాట్లు చేయాల్సిఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.
మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం
తమ వారు మరణించడంతో రోదిస్తున్న కుటుంబసభ్యులు
గత దుర్ఘటనలు
► 2003, ఆగస్టు 27: మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 39మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు.
► 2005, జనవరి 25: మహారాష్ట్రలోని మంధర్ దేవీ ఆలయంలో కొబ్బరికాయలు భారీగా కొట్టడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. బురదపై భక్తులు హఠాత్తుగా జారిపడి తొక్కిసలాట ఆరంభమైంది. ఈ ఘటనలో 340 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.
► 2008, ఆగస్టు 3: హిమాచల్‌ప్రదేశ్ నైనా దేవీ మందిరం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయన్న పుకార్లు గందరగోళానికి దారితీసాయి. దీనివల్ల జరిగిన తోపులాటలో 162మంది మరణించగా 47మంది గాయపడ్డారు.
► 2010, మార్చి 4: యూపీలోని కృపాల్ మహరాజ్‌కు చెందిన రామ్ జానకీ ఆలయం వద్ద ఉచితంగా ఆహారం, దుస్తులు పంచారు. వీటికోసం జరిగిన తొక్కిసలాట 63మందిని బలి తీసుకుంది.
► 2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని హర్ కా పౌరీ ఘాట్‌లో తొక్కిసలాట 20మంది మృతికి కారణమైంది.
► 2012, నవంబర్ 19: పాట్నా వద్ద ఛాత్‌పూజ జరిగే అదాలత్ ఘాట్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలి 20మంది మరణించారు.
► 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని రత్నగిరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నదిపై వంతెన కూలిపోతోందన్న పుకార్లు భారీ తొక్కిసలాటకు కారణమయ్యాయి. దీంతో 115మంది మరణించగా, 100మంది గాయపడ్డారు.
► 2014, అక్టోబర్ 3: పాట్నాలోని గాంధీ మైదానంలో దసరా ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆరంభమైన తోపులాట 32మం దిని బలికొంది. 26మంది గాయపడ్డారు.
► 2015, జూలై 14: ఏపీలో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment