ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ చురక
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా తూర్పార బట్టారు. మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో సరకుల లోడింగ్ కేంద్రం వద్ద చిరు ఉద్యోగాల కోసం వేలాది మంది నిరుద్యోగ యువత క్యూ వరసల్లో నిల్చుని తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గుర్తుచేశారు.
‘‘ కొద్దిరోజుల క్రితం ముంబైలో మోదీ మాట్లాడు తూ మేం కోట్లాది మందికి ఉపాధి కల్పించి రికార్డ్‌లు బ్రేక్ చేశామని ఢంకా బజాయించారు. కానీ అదే ముంబైలో చిన్నపాటి ఉద్యోగాల కోసం వేలాదిగా యువత ఆశతో ఎగబడటం మనందరం చూశాం. ఇదే ఏడాది గుజరాత్‌లో 25 ఉద్యోగాల కోసం ఏకంగా లక్షలాది మంది నిరుద్యోగులు తండోపతండాలుగా తరలిరావడమూ మనందరికీ తెల్సిందే. ఇవన్నీ చూస్తుంటే రికార్డ్‌లు బ్రేక్ అయినట్లు తెలుస్తూనే ఉంది. కానీ ఆ రికార్డ్‌లు నమోదైంది ఉద్యోగాల్లో కాదు నిరుద్యోగంలో. దేశాన్ని తీవ్ర నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ఇప్పటికైనా మోదీ ఉత్తమాటలు చెప్పడం మానేసి ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టాలి’’ అని ప్రియాంక నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment