స్టన్ స్వామి చిత్ర పటాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి తమిళనాడు భవన్‌లో బస చేసి ఆయన సోమవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా గత నెల 17న స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్రపక్షాల నేతల్ని కలిసి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం హఠాత్తుగా ఆయన ఢిల్లీ పయనం అయ్యారు.
సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి, ఎంపీ కనిమొళి, దయానిధి మారన్‌తో కలిసి చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే ఎంపీలు సైతం పయనం అయ్యారు. తమిళనాడు భవన్‌లో ఆదివారం రాత్రి బసచేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా నీట్ మినహాయింపు, రాజీవ్ హంత కుల విడుదల, మేఘదాతు వివాదాలను రాష్ట్రపతి దృష్టికి స్టాలిన్ తీసుకెళ్లనున్నట్టు తెలిసింది.
కరుణ చిత్ర పటం..
సెయింట్‌జార్జ్ కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరంలో కామరాజర్, ఎంజీఆర్, జయలలిత సహా 17 మంది నేతల చిత్ర పటాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆగస్టు 7న కరుణానిధి మూడో వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో ఆయన చిత్ర పట ఆవిష్కరణకు స్టాలిన్ నిర్ణయించినట్టు తెలిసింది.. కరుణ చిత్ర పటాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవి ష్కరణకు నిర్ణయించినట్టు సమాచారం. అందుకే రాష్ట్రపతి అనుమతి కోరడం, ఆహ్వానించేందుకే ఈ ఢిల్లీ పర్యటన అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీ పర్యటనకు ముందుగా లయోలా కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో తిరుచ్చికి చెందిన సామాజిక కార్యకర్త, ఇటీవల అనారోగ్యంతో ఉత్తరాది జైలులో మరణించిన స్టన్ స్వామి చిత్ర పటాన్ని స్టాలిన్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆయన కోసం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్, ఎంపీలు కనిమొళి, దయానిధిమారన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment