'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్! | First Meeting Of One Nation One Election Committee On September 23 | Sakshi
Sakshi News home page

'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి ముహూర్తం ఖరారు

Published Sat, Sep 16 2023 3:31 PM | Last Updated on Sat, Sep 16 2023 4:17 PM

First Meeting Of One Nation One Election Committee On September 23 - Sakshi

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి సెప్టెంబర్ 23న ముహూర్తం ఖరారైంది.  

ముహూర్తం ఫిక్స్.. 
కొద్ది రోజుల క్రితం ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిన కేంద్రం అనుకుందే తడవు హుటాహుటిన ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాయాలు గురించి అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్,  న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర సహా ఇతర ముఖ్య నేతలు సెప్టెంబర్ 6న  సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అధికారిక సమావేశాన్ని సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. 

కమిటీ కర్తవ్యం ఏమిటి?
అయితే ఈ నెల 23న జరిగే సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రాధమిక కార్యాచరణ గురించి చర్చించనున్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ఇతర చట్టాల సవరణలు చేయాల్సి  ఉందా అన్న అంశాలపై కూడా గురించి చర్చించనున్నారు. 

ఉన్నతస్థాయి కమిటీ.. 
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్‌సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరు కానుండగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఈ ప్యానెల్‌కు సెక్రెటరీగా వ్యవహరించనున్నారు.

పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే!
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు పూర్తైన మరుసటి రోజునే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంపైనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగనుందని పుకార్లు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  

ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement