సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, డిఐజి క్రాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్ దంపతులు రోడ్డుమార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి దంపతులు 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment