
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు ప్రముఖులకు 2020 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 141 పద్మ అవార్డులను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అందుకున్నారు. అవార్డులను అందుకున్న వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఏపీలోని మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాప కుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి, తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరొందిన భాష్యం విజయసారథి, అనంతపురం జిల్లాకు చెందిన తోలు బొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పద్మశ్రీ పురస్కారగ్రహీత చింతల వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.