న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ రకమైన ఆలోచనే అప్రజాస్వామికమని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల విధానం.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు చాలా వ్యతిరేకమని తెలిపారు. ఆయన శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్‌కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన జమిలి ఎన్నికల అధ్యయన కమిటికీ లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న, బలమైన రాజ్యాంగం ఉన్న భారత దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించటం అంత అవసరం లేదన్నారు. దానిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ రద్దు చేయాలని కమిటీ కార్యదర్శి నితిన్ చంద్ర రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 18, 2023న ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ.. జమిలి ఎన్నికల విధానంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా కోరిన విషయం తెలిసిందే.
అయితే వారు ముందుగానే అమలు చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత ప్రజల వద్ద నుంచి సంప్రదింపులను కోరటం ఎందుకని ప్రశ్నించారు. అధ్యయన కమిటీని సైతం పక్షపాత ధోరణితో ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీ ఏర్పాటు విషయంతో ప్రతిక్షాలు, పలు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఎన్నికల ఖర్చును ప్రజలు కూడా అంగీకరించడనికి సిద్ధం ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఎన్నికలకు ఖర్చు చేసే డబ్బు.. చాలా తక్కువని ఆయన లేఖలో గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment